వైసీపీ నిరసనలు వెలవెల.. కూటమి సంబరాలు కళకళ
posted on Jun 4, 2025 3:17PM

ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనకు ముగింపు.. తెలుగుదేశం పాలనకు ఆరంభం జరిగి బుధవారం (జూన్ 4) నాటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింద. ఈ సందర్భంగా వెన్నుపోటు దినం అంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అలాగే కూటమి పార్టీలు ఏడాది పాలన సంబరాలకు సమాయత్తమయ్యాయి. ఈ రెండు కార్యక్రమాలలో ఒక కార్యక్రమం వెలవెల బోతే.. రెండోది కళకళలాడింది. అవును జగన్ పార్టీ నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా వెలవెలబోయాయి. అదే సమయంలో కూటమి పార్టీల ఏడాది పాలన సంబరాలు కళకళలాడాయి. కూటమి సంబరాలలో వైసీపీ నిరసనలు ఎక్కడా కనిపించని పరిస్థితి నెలకొంది. కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమిలోని మూడు పార్టీల కీలక నేతలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.
జూన్ 4 ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చేసిన పోస్టు స్ఫూర్తిదాయకంగా ఉంది. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజుగా ఆయన ఆ పోస్టులో జూన్ 4ను అభివర్ణించారు. అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన చారిత్రాత్మకమైన రోజన్నారు. సైకో పాలనకు ప్రజా చైతన్యం అంతం పలికిన రోజనా, రాష్ట్రంలో ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజంటూ చంద్రబాబు పేర్కోన్నారు. సమస్యల పరిష్కారం కోసం జనం ఉద్యమించడం చూశాం.. అయితే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం, రాక్షస పాలనను అంతం చేయడం కోసం ఓటు వేయడానికి ఉద్యమంగా కదిలిన జనాలను చూడటం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కు సరిగ్గా ఏడాది కిందట ఈ రోజు జనం నాంది పలికారన్నారు.
ఇక జనసేనాని పవన్ కల్యాణ్ అయితే ప్రజా తీర్పునకు ఏడాది అంటూ ఆరంభించి ప్రజా చైతన్యానికి కూడా ఏడాది, ప్రజాస్వామ్య పరిరక్షణకూ ఏడాది అని, ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది అని ఉద్వేగపూరితంగా ట్వీట్ చేశారు. జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ తో సాధించిన విజయానికి డాది అని పేర్కొన్నారు. ఐదేళ్ల అరాచకపాలనను తరిమికొట్టి.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన ప్రజల పరిణితి చరిత్రలో నిలిచిపోయిన రోజని పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అటు కేంద్రం లోని నరేంంద్ర మోదీ సర్కారు విజయాలను గుర్తు చేస్తూనే…మోదీ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.