తిరుమలలో కళాకారులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
posted on Jul 2, 2025 9:49PM
.webp)
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరును దుర్వినియోగం చేస్తూ, కళాకారుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని మోసగించిన కేసులో కేటుగాడిని తిరుమల వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన సూత్రపు అభిషేక్.. తిరుమలలోని ఆస్థాన మండపంలో ‘శ్రీనివాస కళార్చన’ పేరుతో రెండు రోజుల నాట్య ప్రదర్శనను నిర్వహిస్తానని చెప్పి శ్రీవారి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారిక అనుమతి లేకుండానే తెలుగు రాష్ట్రాల్లోని 93 కళాబృందాలకు చెందిన 2,900 మంది కళాకారులను నమ్మించి మోసం చేశాడు.
వారి వద్ద నుంచి రూ.35 లక్షలు వసూలు చేశాడు. కళాకారులకు వసతి, భోజనం, శ్రీవారి దర్శనం, ప్రసాదం, మెమెంటోలు, శాలువాలు వంటి సదుపాయాలు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చాడు. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనుమతి లేదని, ఈ మొత్తం ప్రక్రియ ఒక మోసపూరితం అని గుర్తించి తిరుమల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా జులై 1న అభిషేక్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.14 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తిరుపతి కోర్టులో హాజరు పరిచారు. ఫేక్ ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పదని తిరుపతి పోలీసులు హెచ్చరిస్తున్నారు.