జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి పరిస్థితి విషమం.. దాడి వెనుక ఆమంచి హస్తం!!

 

చీరాలకు చెందిన విలేఖరి నాగార్జున రెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు దాడి చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఆమంచి కృష్ణమోహన్, ఆయన అనుచరుల అకృత్యాలపై ఒంగోలులో ఎస్పీకి ఫిర్యాదు చేసి వస్తున్న సమయంలో నాగార్జునరెడ్డిపై దాడి జరిగింది. దీంతో ఆయనపై దాడిచేసింది కృష్ణమోహన్ అనుచరులే అయ్యుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆమంచి అనుచరుల అకృత్యాలపై.. ఎస్పీకి ఫిర్యాదు చేసి స్నేహితుడు కృష్ణ ద్విచక్ర వాహనంపై వేటపాలెంవైపు వస్తుండగా కొందరు వ్యక్తులు దాడి చేశారు. నాగార్జునరెడ్డిని అక్కడ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తప్పించుకున్న కృష్ణ.. విషయాన్ని నాగార్జున కుటుంబ సభ్యులకు తెలిపాడు. 

రాత్రి 8 గంటల సమయంలో కొత్తపేట ఏఎస్‌ఆర్‌ హ్యాండ్లూమ్స్‌ సమీపంలో ఓ వ్యక్తి అపస్మారకస్థితిలో పడి ఉన్నాడన్న సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది నాగార్జునను చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం.. మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. ప్రస్తుతం నాగార్జున పరిస్థితి విషమంగా ఉంది. కాగా, నాగార్జునపై గతంలోనూ దాడి జరిగిందని తెలుస్తోంది. ఆమంచి సోదరుడు స్వాములు అలియాస్ శ్రీనివాసరావు గడియారం స్తంభం సెంటర్లో దాడి చేశారని సమాచారం.

ఈ ఘటనపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. "వైసీపీ ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. చీరాల విలేఖరి నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన దాడి అమానుషం. అక్రమాలు బయటపెడితే కక్షగడతారా? పదేపదే దాడి చేస్తారా? ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేసారంటే పోలీసులు ఏం చేస్తున్నారు?" అని ట్వీట్ చేసారు.