బరితెగించిన వైసీపీ

వైసీపీ అరాచకత్వం అవధులు దాటిపోతోంది. వైసీపీ మూకలు బరితెగించేశాయి. రాష్ట్రంలో తమ పార్టీకి ఎదురు గాలి వీస్తోందని తేటతెల్లం కావడంతో వారిలో అసహనం రోజు రోజుకూ పెచ్చరిల్లుతోంది. ప్రశ్నించేవారిపై దాడులు, దౌర్జన్యాలతో విరుచుకుపడటం నిత్యకృత్యంగా మారిపోయింది.  ముఖ్యంగా గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడుకు మూడు స్థానాలలోనూ పరాజయం పాలవ్వడం, ఆ తరువాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో అనూహ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే క్రాస్ వోటింగ్ కు పాల్పడి తెలుగుదేశం ఎమ్మెల్యే పంచుమర్తి అనూరాథను గెలిపించడంతో వైసీపీ శ్రేణులకూ రాష్ట్రంలో ట్రెండ్ ఏమిటన్నది సందేహాలకు అతీతంగా అవగతమైపోయింది.

దీంతో విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నాయి. ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడున్నాయి.  శుక్రవారం ( మార్చి 31) ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల వైసీపీ దాడులకు దిగింది. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సహా ఆ పార్టీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.  అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా మందడంలో జరిగిన సభలో పాల్గొని తిరిగి విజయవాడ వెళ్తున్న సమయంలో భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ వాహనంపై ఉద్దండరాయుని పాలెం వద్ద వైసీపీ కార్యకర్తలు దాడి పాల్పడ్డారు. వాహనాలకు అడ్డంగా నిలబడ్డారు. పక్కకు తొలగానికి కోరిన బీజేపీ నేతలపై దాడులకు పాల్పడ్డారు. సత్యకుమార్ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన వాహనం అద్దాలు పగిలిపోయాయి.

ఇక మరో దాడి తెనాలి మునిసిపల్ కౌన్సిల్ లో జరిగింది. తెనాలి మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్ యుగంధర్ పై వైసీపీ కౌన్సిలర్లు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఇంతకీ ఈ దాడికి కారణమేమిటంటే..  నవరత్నాలు పథకం పనుల్లో సింగిల్ టెండర్ ఆమోదంపై ఆయన అభ్యంతరం తెలపడమే. సింగిల్ టెండర్ల ఆమోదంపై ప్రశ్నిస్తున్న యుగంధర్ ను మాట్లాడకుండా కూర్చోవాలని వైసీపీ సభ్యులు గొడవ చేశారు.

అయితే తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టిన యుగంధర్ పై వైసీపీ కౌన్సిలర్లు  దాడికి పాల్పడ్డారు.  దీంతో తెనాలి కౌన్సిల్ సమావేశం రణరంగాన్ని తలపించింది. వైసీపీ కౌన్సిలర్ అహ్మద్ సహా మరోముగ్గురు ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్ లో తరిమి తరిమి మరీ కొట్టారు. దీంతో  తెలుగుదేశం కౌన్సిలర్లు చైర్మన్ పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.