మా నాయకుడే పార్టీ కొంప ముంచాడు.. రఘురామ కృష్ణం రాజు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ కొంప ముంచింది సాక్షాత్తూ జగనేనని పేర్కొన్నారు. శనివారం రచ్చబండ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన గ్రాడ్యుయేట్ ఎన్నికలలో వైసీపీ ఓటమికి కారణం కేవలం విద్యావంతులలో వచ్చిన మార్పుగానే తీసుకోవడానికి వీల్లేదనీ, యావత్ రాష్ట్ర ప్రజల స్పందనకు ఇది ప్రతిఫలమని అన్నారు. ప్రజలలో మార్పు మొదలైందని రఘురామ అన్నారు.  

రకరకాల కాంబినేషన్ వల్ల, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారని అన్నారు. ఏ విధంగా చూసుకున్నా ఇది యావదాంధ్ర ప్రజల స్పందన అని చెప్పారు.   ప్రజలు ఇలాగే డిసైడ్ అయిపోయారు. ఇదే విషయాన్ని తాను గత రెండున్నర సంవత్సరాలుగా చెబుతున్నానని, పద్ధతి మార్చుకోమని పార్టీ అధినేతను కోరుతున్నాననీ,  అక్రమ కేసులలో అరెస్టు చేసి చితకబాదినా నిజం చెబుతూనే ఉన్నానన్నారు.  ఏపీలో వైసీపీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది.   108 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడిన  ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడిన తర్వాత, ఇప్పటి వరకు భయంతో భయపడిన ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ధైర్యంగా బయటకు వచ్చారు.  ఈ ప్రభుత్వం పని అయిపోయిందని, ఇంకా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్న ధైర్యం వారిలో కనిపిస్తోందన్నారు. రోజు రోజుకి ఈ ధైర్యం ఎక్కువ అవుతుందనడంలో సందేహం లేదు. కడప, కర్నూల్, అనంతపూర్ పాత జిల్లాలకు చెందిన పశ్చిమ రాయలసీమ తెలుగుదేశం అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఏ ఒక్క ఓటర్ కు రూపాయి పంచలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  బూతుల వద్దే  ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు.  టిడిపి అభ్యర్థులు  చిరంజీవి, శ్రీకాంత్ లు కూడా ఓటర్లకు ఒక్క రూపాయ పంచిన దాఖలాలు లేవు అదే వెన్నపూస రెడ్డి వెన్నపూస కరిగినట్లుగా ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసినప్పటికీ, అధికారపక్షానికి ప్రజలు గుణపాఠం చెప్పారు.

ఎన్నికల్లో డబ్బుల ప్రభావం కేవలం  కొద్దిగా మాత్రమే చూపిస్తుందని ఈ ఫలితాలు తేల్చాయన్నారు. మా పార్టీ నాయకులు  1000 నుంచి  5000 రూపాయల వరకు ఖర్చు చేసినప్పటికీ, గతంలో మా పార్టీకి వచ్చినట్లుగా  50% మెజార్టీ ఇప్పుడు టిడిపి అభ్యర్థులకు వచ్చిందన్నారు. ఎన్నికల్లో ధనం పనిచేయదని, మా పార్టీ నేతల సరదా తీర్చడానికి జనం డబ్బులు తీసుకుని తెలుగుదేశం పార్టీకి ఓటేశారని రఘురామ చెప్పారు.   ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళని దేవుడి హుండీ లో పైసలు వేసినట్లుగా, ప్రజలే దేవుళ్లను కొని డబ్బులు ఇస్తే స్వీకరించాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు.  రానున్న ఎన్నికల్లో ధన ప్రభావం ఉండదని, ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.

టిడిపి,  జనసేన తో పాటు వామపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తే, క్వాలిటీ నేతలు వెలుగులోకి వస్తారని అభిప్రాయపడ్డారు. జగనన్న విద్యా దీవెనలు భాగంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఓటు హక్కు నమోదు చేసుకున్న రెండు,  మూడవ తరగతి చదివినవారు రెండు పక్కన ఒకటి వేయాలని చెబితే, ఒకటి పక్కన ఒకటి వేసినట్లు తెలిసిందన్నారు. వై నాట్ 175 పోయిందని, ప్రస్తుతం అన్ని ఊర్లు తిరుగుతానని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని, అంటే రాష్ట్రవ్యాప్తంగా  వృక్షాలు కనపడకుండా చేస్తారేమోనని  వృక్ష ప్రేమికులు భయపడుతున్నారు, ఇప్పటి వరకూ  కొట్టేసిన వృక్షాలు చాలని, ఇకపై వృక్షాలను నరకవద్దని  జగన్మోహన్ రెడ్డిని వృక్ష ప్రేమికులు కోరుతున్నారని  రఘురామకృష్ణంరాజు తెలిపారు. 

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం కు వస్తానని చెబితే, స్థానిక ప్రజలు వద్దని  ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిని  మెగాస్టార్ చిరంజీవిని చేసినంత పని చేశారని రఘురామకృష్ణం రాజు అన్నారు. మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఒక దరిద్రపు నిర్ణయం వల్ల పరిస్థితి తిరగబడింది అన్నారు. పార్టీ అధ్యక్షుడి హోదా లో అమరావతే రాష్ట్ర రాజధాని అని చెప్పి, ముఖ్యమంత్రి అయిన తర్వాత  విశాఖపట్టణానికి  రాజధానిని మారుస్తానని చెప్పడం, మంత్రులు వంది మాగధులమద్దతునివ్వడం వల్లే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయామని రఘురామకృష్ణంరాజు తెలిపా రు.

అంటే వైసీపీ కొంప ముంచింది స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగనేనని ఆయన ఉద్ఘాటించారు.  ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్  తమకు అండగా ఉంటా రని  ప్రజలు నమ్ముతున్నారు.   ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వకూడదని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్  భావిస్తున్నారు. వారిద్దరూ కలిసి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని రఘురామకృష్ణం రాజు  తెలిపారు. తెలుగుదేశం పార్టీ 40 శాతం ఓటు బ్యాంకు ఉండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి  ఎన్ని తప్పులు చేసినా 25% ఓటు బ్యాంకు  ఉంటుంది. మిగిలిన 35 శాతం ఓటు బ్యాంకును చీలకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన  బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర ప్రతిపక్ష నేతలపై ఉన్నదని చెప్పారు.

 ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ప్రభావం తీవ్రంగా కనిపించింది. తన వారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలు చూస్తే, రానున్న ఎన్నికల్లో 10 స్థానాలకు పరిమితమైనా   ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని  రఘురామ అభిప్రాయపడ్డారు.  విశాఖ రాజధాని కావాలని  ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారని గతంలో పేర్కొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు,  ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గి  ఇది ప్రజల అభిప్రాయమని గోబెల్స్ ప్రచారం చేయాలని చూశారు. ఎ  ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూసి  మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు లలో ఒకరు రాజీనామా చేస్తారా?, లేకపోతే ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేస్తారా?? అన్నది తేల్చుకోవాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు.