నేలతల్లికి నీరాజనం –  ప్రపంచ నేల  దినోత్సవం 2024.. ! 

 

మనం మట్టిని  భూమాత, నేలతల్లి అని పిలవటం దాని లక్షణానికి అచ్చంగా సరిపోతుంది. ఎందుకంటే ఒక అమ్మ ఎలా అయితే తన పిల్లల్ని పెంచి, పోషించటానికి తనలోని శక్తి సన్నగిళ్లేవరకూ పాటుపడుతుందో, అలాగే ఈ నేల తనలోని సారమంతా సన్నగిళ్లేవరకూ మొక్కల్ని పెంచి, పోషించి ఈ భూమి మీద ఉన్న జీవజాల  మనుగడకి ఆధారమవుతుంది. అయితే శక్తి సన్నగిల్లిన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఎలా అయితే పిల్లలకి ఉంటుందో, అలాగే నేలతల్లి  అందించిన ఆహారం తింటున్న మనకి దాని గొప్పదనాన్ని గుర్తించి, దాని బాగోగులు కూడా చూసుకోవాల్సిన  బాధ్యత ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. 

ప్రపంచ నేల  దినోత్సవం

మన ఆహారంలో 95%కి పైగా నేలలోనుంచే ఉత్పత్తి అవుతోంది. కాబట్టి, ఈ సహజ వనరు ఆరోగ్యంగా ఉండటమనేది మనుషులకే కాదు, భూమి మీద ఉన్న  జీవజాలమంతటి  మనుగడకీ  అవసరమే. అందుకే భూమి మీద హాయిగా జీవించాలంటే   నేలకున్న  ప్రాముఖ్యతను తెలియజేస్తూ,  ప్రపంచ నేల దినోత్సవం ఆవిష్కరణను 2002లో ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్’ ప్రతిపాదించింది. దీన్ని 2013లో ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ అధికారికంగా ఆమోదించింది. ఆ తర్వాత, ‘సంయుక్త జాతుల సాధారణ అసెంబ్లీ’ ఈ దినోత్సవాన్ని 2013 డిసెంబర్‌లో ఆమోదించింది. కానీ ఈ దినోత్సవానికి డిసెంబర్ 5ని ఎంచుకోవడమన్నది   థాయ్‌లాండ్‌కు చెందిన భూమిబోల్ ఆదుల్యదేజ్ అనే రాజు గౌరవార్ధం జరిగింది.

2024కి గానూ ప్రపంచ నేల దినోత్సవ థీమ్:

“నేలని సంరక్షించండి - కొలవడం, పర్యవేక్షించడం, నిర్వహించడం”

ఈ సంవత్సరం ఎంచుకున్న థీమ్ అనేది  నేల ఆరోగ్యం, ఆహార భద్రత, పర్యావరణ స్ధిరత్వం మధ్య అనుబంధాన్ని బలంగా చూపిస్తుంది. ఆహార భద్రతను, వాతావరణ మార్పులను ఎదుర్కోవడాన్ని, పర్యావరణ వ్యవస్థల స్ధిరత్వాన్ని అందించడంలో నేలకి సంబంధించిన  ఖచ్చితమైన డేటా అవసరమని చెప్తుంది.  

భారత భౌగోళిక, వాతావరణ పరిస్థితుల కారణంగా ఒండ్రుమట్టి, నల్లరేగడి, బంకమట్టి, ఎర్రమట్టి నేలలు, ఎడారి నేలలు, కొండప్రాంతపు నేలలని వివిధ రకాల మట్టి పుడుతుంది. అయితే  ఒక్కో రకపు మట్టి కొన్నికొన్ని    ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండి, రకరకాల   పంటలకు అనుకులంగా ఉంటుంది.  వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడంలో, ఆహార భద్రతను కల్పించడంలో మట్టి మీద  అవగాహన ఉండటం చాలా ముఖ్యమైనది.

 నేలకున్న సమస్యలు.. సవాళ్లు, ముప్పులు: 

నేలకి  సహజ ప్రక్రియలవల్ల,  మానవ చర్యల ద్వారా కూడా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలు మట్టి ఆరోగ్యం, జీవవైవిధ్యం, ఆహార భద్రతపై ప్రభావం చూపుతున్నాయి. ఇక్కడ నేలని ముప్పులోకి నెట్టే ప్రధాన సవాళ్లుగా కొన్నింటిని చెప్పవచ్చు.   

నేల దెబ్బతినడం: 

 నీరు, గాలి ద్వారా మట్టి కొట్టుకుపోతుంటుంది. అలాగే  అడవులని నరికేయటం, పంటల మార్పిడి లేకపోవడం, ఇంకా  మారుతున్న వ్యవసాయ పద్ధతులు మట్టిని త్వరగా దెబ్బతినేలా చేస్తాయి.

పంటలకి  పోషక లోపం:  

భారతదేశంలో ప్రాంతాలను బట్టి  చాలా భాగం నేలలు నత్రజని, ఫాస్ఫరస్ లోపంతో ఉన్నాయి.  అందువల్ల ఎరువు ఎంత వేయాలో అనే అవగాహన కూడా లేని రైతులు, సబ్సిడీలో తీసుకున్న రసాయన ఎరువులని  విపరీతంగా ఉపయోగించటం వల్ల నేల సారం మారిపోయి పంటలకి పోషణ అందట్లేదు. 

ఎడారీకరణ:  

పెరుగుతున్న జనాభా ఒత్తిడి కారణంగా అడవులని కొట్టేయటం వల్ల, పశువుల అధిక మేత వలన సారవంతమైన నేలలు సారం కోల్పోయి ఎడారిగా మారుతున్నాయి. 

 నీరు నిల్వ ఉండిపోవటం:  

నీటిపారుదల సరైన విధంగా లేకపోవడం, నేలలో వాటర్ చానల్స్‌ నుంచి నీరు లీకేజీ అవ్వటం వల్ల లక్షల ఎకరాల భూములు నీటితో నిండిపోతున్నాయి. దీనివల్ల మట్టి నిర్మాణం దెబ్బతిని, ఉత్పాదకత తగ్గిపోతుంది. 

ఉప్పదనం,  క్షారతనం:  

నీటిపారుదల అధికంగా ఉండే ప్రదేశాల్లో   మట్టిలో ఉప్పు పేరుకు పోవడం వల్ల కూడా అక్కడ నేల పంటకి అనుకూలం కాకుండా పోతుంది. 


పట్టణీకరణ,  పాడుబడిన భూములు:  

పట్టణాలకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ స్థలానికి డిమాండ్ పెరిగి చుట్టుపక్కల మంచి పొలాలు కూడా లే-అవుట్లగా మార్చేస్తున్నారు. అలాగే  రసాయనాలు,  లోహాలతో  పరిశ్రమల వ్యర్థాలు నేలని కాలుష్యం చేస్తాయి. 

పారిశ్రామీకరణ:  

నేలని నాశనం చేసే ఓపెన్-కాస్ట్ మైనింగ్, పరిశ్రమల కోసం వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాలని ఆక్రమించుకోవటం. 

ప్రపంచ నేల దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి? 

నేల సారాన్ని కాపాడటం: నేలలోని పైపొరల్లో  ఖనిజాలు, సేంద్రీయ పదార్థాలు, నీరు, గాలి ఉంటాయి.  ఇది మొక్కల పెరుగుదలకు బలంగా ఉండి, భూమిపై జీవం మద్దతు కోసం అవసరమైనది.  అందుకే ఈ నేల సారం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం: 

ఆరోగ్యవంతమైన నేల  ఆహార భద్రతకు కీలకం. కాబట్టి నేల పాడవకుండా వ్యవసాయ విధానాలు పాటించేలా ప్రోత్సహించాలి. 

జీవ వైవిధ్యాన్ని కాపాడటం:

నేడు రకరకాల రసాయనాల వినియోగం వల్ల సహజంగా నేల సారాన్ని పెంచటంలో సాయపడుతున్న జీవులు చనిపోతున్నాయి. అందుకే న్యూట్రియంట్ సైక్లింగ్,  కార్బన్ నిల్వల్లో  కీలక పాత్ర పోషించే జీవులను రక్షించాలి. 

అవగాహన కలిగించడం: 

భవిష్యత్ తరాలకు నేల  సంరక్షణ అనేది ఈ భూమి మీద మానవ మనుగడకి చాలా అవసరమనే  అవగాహన కలిగించాలి. 

నేలని కాపాడుకోవటానికి ఏం చేయాలి?   

మొక్కలు నాటటం:   

మట్టి కొట్టుకుపోయే ప్రాంతాల్లో వృక్షాలు నాటడం దారా  మట్టిని దెబ్బతినకుండా కాపాడవచ్చు. 

వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్:   

ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IWDP) వంటి కార్యక్రమాలు ద్వారా నీటి పారుదలని సమర్ధవంతంగా  నిర్వహించాలి. 

టెర్రేస్ వ్యవసాయం: 

పర్వత ప్రాంతాల్లో నేలను మెట్లు లాగా  పైనుంచి కిందవరకూ చెక్కి ఉంచే విధానంలో  మట్టి నీటితో పాటూ కిందకి కొట్టుకుపోకుండా కాపాడుతుంది.  

ఆర్గానిక్ వ్యవసాయం: 

రసాయన ఎరువులు వినియోగం తగ్గించి ఆర్గానిక్  ఎరువులు ఉపయోగిస్తూ వ్యవసాయం చేస్తే నేల సారం పెరుగుతుంది. 

నేలను  కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఇలా చేస్తే మనవంతు మన నేల తల్లికి సేవ చేసిన వాళ్ళమవుతాం. అందుకే  మట్టిని సంరక్షించడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.

"ఆరోగ్యకరమైన నేల, ఆరోగ్యకరమైన గ్రహం!" “ ఆరోగ్యకరమైన గ్రహం, ఆహ్లాదకరమైన జీవితం”అనే విషయాన్ని మర్చిపోకూడదు.


                                 *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu