ఆకలి మీద బ్రహ్మాస్త్రం

అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది పెద్దల మాట. అంటే అన్నాన్ని దైవంతో సమానంగా చూస్తారు. శరీరానికి శక్తినిచ్చి, ఆరోగ్యాన్ని చేకూర్చి జీవితకాలాన్ని హాయిగా సాగేలా చేసేది ఆహారం. అన్నమే కాదు మనిషి కడుపు నింపే ప్రతి ఆహారం కూడా దైవ స్వరూపమే.

ఒక పండ్ల మొక్క నాటుతాం, లేదా విత్తనాన్ని విత్తుతాం. దానికి నీళ్లు పోసి, అపుడపుడు కలుపు తీస్తూ, దానికి పోషకంగా ఎరువులు వేస్తూ రోజులు, నెలలు, సంవత్సరాలు నిరీక్షిస్తే అప్పుడు చెట్టుగా ఎదిగి కాయలు కాస్తుంది. ఆ కాయలున్న చెట్టును పెంచిన వ్యక్తి ఎంతో జాగ్రత్తగా కాడుకుని కాయలు పండ్లుగా మారే దశలో వాటిని కోసి, మార్కెట్లలోనూ లేక రోడ్ల మీద లేక ఇంకా ఇతర మార్గాల ద్వారా అమ్ముతారు. ఒక పండు ధర పది రూపాయలు అయితే దాని వెనుక ఒకరు లేదా ఇంకా ఎక్కువ మంది కష్టం చేసి చిందించిన చెమట తాలూకూ అనుభవాలు కూడా ఉంటాయి. కానీ కొన్న వాటి మీద ఏదో హక్కు ఉన్నట్టు సరిగా తినీ తినక, చెత్త బట్టలలోకి వేస్తూ పండు తాలూకూ కష్టాన్ని అవమానిస్తూ ఉంటాము. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇలాంటి విషయాలు తెలియదు. చాలా ఇళ్లలో పిల్లలు సగం తిని వదిలేసిన పండ్లు, ఆహారపదార్థాలు ఎక్కువగా కనబడుతుంటాయి. వాళ్ళది తెలియని వయసు కావచ్చు కానీ పెద్దలది తెలియని వయసా?? లేక డబ్బె పెట్టి కొనడం ద్వారా వచ్చిన నిర్లక్ష్యపు ధోరణినా??

అన్నమో రామచంద్ర!!

ఒకవైపు  ఇంట్లో ఇలాంటి వృథా జరుగుతూ ఉంటే మరొకవైపు బయట మాత్రం అన్నమో రామచంద్ర అని ఆకలికి నకనకలాడుతున్న అభాగ్యులు ఎందరో!!  మనకేంటి తల్లిదండ్రులు కొద్దో గొప్పో మంచి జీవితాన్నే ఇచ్చారు, ప్రతి తల్లిదండ్రి అలాగే ఇవ్వాలని అనుకుంటారు కూడా, కానీ కొన్ని జీవితాలు తెగిన గాలిపటాల్లా ఉంటాయి. గాలి ఎటు వేస్తే అటు గాలిపటం వెళ్లినట్టు, ఎక్కడ పని దొరికితే అక్కడ చేసుకుంటూ బతికేవాళ్ళు ఉంటారు. కష్టానికి తగ్గ డబ్బులు చేతికి అందని అమాయకులు ఉంటారు, దోపిడీ చేయబడేవారు, బానిస బతుకుకు లోబడిన వారు ఇలా ఎందరో!! వీళ్ళందరూ మురికివాడల్లోనూ, ఊరి పొలిమేరల్లోనూ చిన్న గుడిసెలు వేసుకుంటూ రేపటి గూర్చి కాకుండా ప్రస్తుతం గడిచిపోవడం గురించి ఆలోచిస్తూ బతికే వాళ్ళు. అలాంటివాళ్ళకు ఒకోసారి తిండి కష్టం అవుతుంది. నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లడం కష్టమవుతుంది.

మరోవైపు అన్నదాతా సుఖీభవ అనే స్లోగన్ లతో తెగ చైతన్యపు గొంతులు వినబడతాయి కానీ, ఆహారం దగ్గర అదొక అజమాయిషీ చేసేవాళ్ళు కోకొల్లలు. ఇష్టం వచ్చినట్టు వడ్డించుకుని, నచ్చినంత తిని, చెత్తబుట్టలో పడేసేవాళ్ళు ఎక్కువ. 
జనాభా పెరుగుదల, పేదరికపు  సమస్య, జనాభా లెక్కల్లో నమోదు కాని ప్రజల దైన్యం, పారిశ్రామిక అభివృద్ధిలో యంత్రాల పాత్ర పెరుగుతూ మనిషికి సగటు ఉపాధి మార్గాలు దొరకక, ప్రభుత్వ పథకాల లబ్దికి నోచుకోక, నిరంతరం జీవితంతోనూ, ఆకలితోనూ యుద్ధం చేసేవాళ్ళు ఎందరో కనబడుతుంటారు. 

ఇప్పుడేం చేయాలి??

అవగాహన ముఖ్యం, తదుపరి ఆచరణ అవసరం. అవగాహన చాలామందిలో ఉంటుంది, నిజానికి మనుషులుగా పుట్టిన అందరికి ఆకలి విలువ తెలుసు, అయితే వారి మనసు అంతరాలలో అది ఎక్కడో పెద్ద ప్రాధాన్యత లేని అంశంగా మరుగున పడి ఉంది. దాని ప్రాముఖ్యాన్ని మొదట గుర్తించాలి. ప్రతి మెతుకు వెనుక కష్టాన్ని, ప్రతీ పంట సాగుకు చిందే చెమట ధారను తెలుసుకుంటూ, పిల్లలకు చెబుతూ ఉండాలి. 

పెళ్లిళ్లు, శుభకార్యాలలో అనవసరపు డాబు పోకుండా ఆహారాన్ని దైవంగా భావించి వీలైనంత వరకు వృథా కాకుండా జాగ్రత్త వహించాలి. ప్రతి ఇంట్లో పిల్లలతో ఒక చిన్న విత్తనాన్ని నాటించి వాళ్ళతోనే ఆ మొక్క సంరక్షణ చేయిస్తూ ఉంటే దాని తాలూకూ ఫలితం తప్పకుండా పిల్లల క్రమశిక్షణతో, నడవడికలో, ముఖ్యంగా ఆహారం పట్ల అవగాహన, వృథా చేయకుండా ఉండటం వంటివి అర్థమవుతాయి.అలాగే పిల్లలకు అపుడపుడు ఆహారానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళను చూపిస్తూ వారి కష్టాన్ని తెలియచేస్తూ ఉండాలి. దానివల్ల తాము వృథా చేయడం మాని ఇతరులకు ఇవ్వడమనే మంచి అలవాటు కూడా పెంపొందుతుంది. తిండి కలిగితే కండ కలదోయ్ కండ గలిగిన వాడే మనిషోయ్ అనే మాట నిజమవ్వాలంటే ఆహారం తీసుకోవడం చాలా అవసరమని ఆహారం తీసుకోవడం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో, వృథా చేయకుండా అంతే జాగ్రత్త వహించాలని పిల్లలకు చెబుతూ పెద్దలు ఆచరిస్తే ఈ భారతంలో ఆకలి బాధ ఎక్కడో ఒకచోట పరోక్షంగా అణువంత అయినా తగ్గించిన వాళ్ళం అవుతాము.
                                                                                                                            ◆ వెంకటేష్ పువ్వాడ