నీ ఆత్మ బలం నీ మరణాన్ని కూడా వెనక్కి నెడుతుంది...
posted on Feb 4, 2025 9:30AM
.webp)
హాస్పిటల్లో పరీక్షలు చేయించుకున్నాక క్యాన్సర్ ఉందని నిర్ధారిస్తే లేనివాడయినా, ఉన్నవాడయినా వాళ్ళ కాళ్ళ క్రింద భూమి కదిలినట్టే ఫీలవుతారు. ఏటా లక్షలమంది ప్రాణాలని పిండేస్తూ, అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యగా కొనసాగుతోన్న ఆ మాయదారి రోగం క్యాన్సర్... ప్రపంచమంతటా ఇది చాపకింద నీరులా అల్లుకుంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెలువరించిన డేటా ప్రకారం, 2022లో క్యాన్సర్ దాదాపు కోటిమంది ప్రాణాలను బలిగొంది. కాలక్రమేణా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఇంతటి ప్రాణాంతక వ్యాధి గురించి అవగాహన పెంచడానికి, తగిన చర్యలకు ప్రేరేపించడానికి, క్యాన్సర్ భూతాన్ని నిర్మూలించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుతారు. ఈ సందర్భంగా క్యాన్సర్ గురించి మరింత తెలుసుకుంటే..
ఎప్పుడు మొదలైంది..
2000, ఫిబ్రవరి 4న పారిస్‌లో జరిగిన ప్రపంచ క్యాన్సర్ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రకటించారు. యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ నిర్వహించిన ఈ కార్యక్రమం, క్యాన్సర్ ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తెచ్చేందుకు, దీని నివారణకు చర్యలు తీసుకోవడానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
2025 థీమ్..
ఈ సంవత్సరానికిగానూ, "యునైటెడ్ బై యూనిక్" అనే థీమ్ ఎంచుకున్నారు. ఇది 2025-2027 మూడేళ్ల ప్రచారానికి శ్రీకారం చుడుతుంది. ఈసారి జరిగే ప్రచారంలో క్యాన్సర్ చికిత్సలో వ్యక్తిగత అనుభవానికి ప్రాముఖ్యతనిస్తారు. ప్రతి క్యాన్సర్ రోగి ప్రయాణం భిన్నమైనదని గుర్తించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
అవగాహన చాలా ముఖ్యం..
క్యాన్సర్ వచ్చిందంటే ఇంకేమీ చేయలేము అనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ ముందుగా గుర్తించగలిగితే చాలా మటుకు క్యాన్సర్లని తగ్గించే వైద్యం అందుబాటులో ఉంటుంది. అందుకే దీనిపట్ల అవగాహన ఉండాలి. అప్పుడే అప్రమత్తంగా ఉండి తొలిదశలోనే గుర్తించగలుగుతారు. తక్కువ, మద్య ఆదాయ దేశాలు దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా క్యాన్సర్ ముప్పును ఎదుర్కోవడంలో ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అలాగే, నిరక్షరాస్యత, క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం కావడం, ఖర్చుతో కూడుకున్న చికిత్స కారణంగా క్యాన్సర్ కు వైద్యం అందరికీ అందడం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం నిర్ధారణను ఆలస్యం చేస్తుంది. 2020లో భారతదేశంలోని నాలుగు ప్రధాన కేంద్రాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, క్యాన్సర్ రోగులలో చాలామంది ముందుగా చికిత్స పొందటానికి వచ్చే సమయానికి అప్పటికే వారి వ్యాధి తీవ్ర స్థితికి చేరుకున్నట్లు గుర్తించారు. అందుకే శరీరంలో మార్పులని గమనించటంలో, క్యాన్సర్ లక్షణాలు గుర్తించటంలో కాస్త అవగాహన అందరిలోనూ ఉండాలి. క్యాన్సర్ కేవలం పెద్దవాళ్లలోనే వస్తుంది తప్ప పిల్లలకి రాదు అని, షుగర్ వల్ల క్యాన్సర్ పెరుగుతుందని, క్యాన్సర్ వైరస్ ద్వారా వస్తుందని.. ఇలా ఎన్నో అపోహలు, భయాలు సామాన్య జనంలో ఉంటుంటాయి. క్యాన్సర్ పట్ల తగిన అవగాహన లేకపోవటమే దీనికి కారణం.
భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో, క్యాన్సర్ స్క్రీనింగ్, నిరోధక చర్యలు, చికిత్సల గురించి అవగాహన తక్కువగా ఉంది. ఇది క్యాన్సర్ వ్యాప్తిని పెంచే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ నివారణ, ముందుగా గుర్తించడం, చికిత్స చేయడంలో ఉన్న ప్రాముఖ్యతను అందరికీ గుర్తు చేస్తుంది.
మంచి అలవాట్లు..
సిగరెట్, బీడీలు కాల్చే అలవాటున్నవాళ్ళు, మందు తాగేవాళ్లు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు తీసుకునేవారు అవన్నీ తక్షణమే మానుకోవాలి. టీవీల్లో ,సినిమాల్లో బయట ఇలా ఎన్నిచోట్ల ప్రచారం చేసినా వీటిని మానడం లేదు. వీటిని మానేస్తే నోరు, గొంతు, కాలేయం వంటి భాగాలకి వచ్చే క్యాన్సర్ రాకుండా ఆపొచ్చు. క్రమం తప్పకుండ వ్యాయామం చేయటం వల్ల బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్ ముప్పునుంచి తప్పించికోవచ్చు. హెచ్‌పివి, హెపటైటిస్ బి వంటి వ్యాక్సిన్లు తీసుకోవటంవల్ల గర్భాశయ, కాలేయ క్యాన్సర్లను నిరోదించవచ్చు. మంచి పోషకాహారం తీసుకోవటం, శరీరంతో పాటూ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ఒత్తిడిని తగ్గించుకోవటం, క్రమం తప్పకుండ వైద్య పరీక్షలు చేసుకోవటం వంటి అలవాట్ల వల్ల మనం ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
క్యాన్సర్ రోగులకి అండగా నిలవాలి..
క్యాన్సర్ దినోత్సవం సాక్షిగా నైతిక భాద్యతతో ప్రజలంతా క్యాన్సర్ రోగులకి మానసికంగా, ఆర్ధికంగా అండగా నిలబడాలి. క్యాన్సర్ రాకుండా ఉండేలా ఎలా జాగ్రత్తపడాలి, ఏం చర్యలు తీసుకోవాలి వంటివాటి గురించి అవగాహన కల్పించాలి. అందరూ మంచి జీవన శైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించాలి. ఆధునిక సమాజంలో క్యాన్సర్ కారకాలుగా మారుతున్న విషయాల మీద కలిసి పోరాడాలి.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...