పెళ్లైన మహిళ జీవితాన్ని నాశనం చేసే విషయాలు ఇవే..!
posted on May 8, 2025 9:30AM
పెళ్లి ప్రతి మహిళ జీవితంలో చాలా ముఖ్యమైన దశ. కేవలం మహిళలకే కాదు.. మగవారికి కూడా ఇది ముఖ్యమైన దశే. కానీ పెళ్లి కారణంగా జరిగే అన్యాయం, నష్టం మగవారితో పోలిస్తే ఆడవారికే ఎక్కువగా ఉంటోంది. మగవారి కంటే ఆడవారే పెళ్లి తర్వాత జీవితాన్ని నష్టపోతున్న వారు అధికంగా ఉంటున్నారు. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరూ సర్దుకుపోమ్మా..అని అమ్మాయిలకే చెబుతూ ఉంటారు. అలాగే.. వివాహ బంధం విఫలమైతే కాపురం నిలబెట్టుకోలేక పోయింది అనే మాట కూడా అంటారు. అయితే అసలు వైఫల్యం వరకు ఎందుకు వెళుతుంది. పెళ్లి తర్వాత మహిళల జీవితాన్ని దెబ్బతీసే అంశాలు ఏంటి? తెలుసుకంటే..
పెళ్లి..
పెళ్లి అనేది ఆడ, మగ ఇద్దరికీ సంబంధించిన విషయం. ఇద్దరు వ్యక్తులు ఒక జంటగా మారిన తరువాత, భార్యాభర్తలు అయిన తరువాత వారి మద్య ప్రేమ మాత్రమే కాకుండా చాలా విషయాలు ఉంటాయి. భార్యాభర్తల వరకు వస్తే.. వారి బంధం బాగానే ఉంటుంది. పెళ్ళి చేసుకుని కుటుంబాన్ని వదిలి, భర్త తో అత్తింటికి చేరిన అమ్మాయితో అత్తింటి కుటుంబ సభ్యులు ఆరోగ్యకరమైన రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేస్తే అంతా బాగానే ఉంటుంది. కానీ చాలామంది అమ్మాయిల జీవితాల్లో ప్రేమ, గౌరవం రెండూ లోపిస్తాయి.
ప్రేమ, గౌరవం లోపిస్తే..
ప్రతి వ్యక్తికి ప్రేమ, గౌరవం ఉన్నప్పుడే సంతోషంగా ఉండగలుగుతారు. కానీ అత్తారింట్లో ఒక అమ్మాయికి ప్రేమ, గౌరవం లోపిస్తే ఆ అమ్మాయి సంతోషంగా ఉండలేదు. దీనికి కారణం అత్తామామలు. ఆ ఇంటి కుటుంబ సభ్యులు. చాలా వరకు అత్తారింట్లో ఆడపిల్లలను వారి అత్తామామలు మొదట్లో బానే మాట్లాడినా ఆ తరువాత కించపరిచి మాట్లాడుతుంటారు. ఇక అమ్మాయిలలో ఏదైనా లోపం ఉంటే మాత్రం అదే విషయాన్ని ప్రతిసారి ప్రస్తావించి ఆమెను మానసిక క్షోభకు గురిచేస్తూ ఉంటారు.
తోడి కోడళ్లు..
చాలా ఇళ్లలో తోడి కోడళ్ల వల్ల ఖచ్చితంగా ఒక కోడలు బాధితురాలిగా మారుతుంది. అత్తగారు, మామగారు, కుటుంబ సభ్యులు కోడళ్ల మధ్య జరిగే చాలా విషయాలను పట్టించుకోరు. జిత్తులమారి స్వభావం ఉన్న కోడళ్లు మంచితనంతో ఉన్నవారిని వేధిస్తూనే ఉంటారు. ఇంటి పని దగ్గర నుండి చాలా విషయాలలో బాధపెడుతుంటారు.
అత్తగారు..
అత్తగారు ఎప్పటికీ తల్లిలా ఉండదని, తల్లిలా చూడలేదని చాలామంది అంటూ ఉంటారు. నిజానికి అత్తగారి విషయంలో అమ్మాయిలకు మనసులో ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడటానికి కారణం కూడా అత్తగారి ప్రవర్తనే. అత్తగారు ఎప్పుడూ కోడలికి వ్యతిరేకంగానే ఉంటారు. కోడలు మంచిగా మాట్లాడినా సరే గిట్టని అత్తగారు ఉన్నారు. కోడలు అత్తగారిని మెప్పించాలని, అత్తగారికి నచ్చే పనులు చేసినా సరే.. కోడలిని విమర్మించేవారు ఎక్కువ. కోడలు ఏం చేసినా ఆమెను సూటిపోటి మాటలతో హింసించే వారు ఎక్కువగా ఉంటున్నారు. అత్తగారి ప్రవర్తన విషయంలో కోడలు తన భర్తతో ఏదైనా చెప్పినా భర్త నుండి ఆమెకు ఎలాంటి సహకారం, ఓదార్పు ఉండవు. ఇలా ఉన్నప్పుడు కోడలు మానసికంగా దెబ్బతింటుంది. మనసులోనే ఆమె చాలా బాధలోకి వెళుతుంది.
భర్త..
చాలామంది అమ్మాయిలు పెళ్లి తర్వాత భర్త చేసే ద్రోహానికి బలి అవుతూ ఉంటారు. చాలా మంది మగవాళ్లు పెళ్లి అనేది ఇష్టం లేకుండానే అవసరం కోసం చేసుకుంటారు. ఇంటి పని చేయడానికి ఒక అమ్మాయి అవసరం అయిందనో.. డబ్బులు సంపాదించడానికి సంపాదించే అమ్మాయి అవసరం అయ్యిందనో.. తల్లిదండ్రుల బలవంతం మీదనో.. తల్లిదండ్రుల సంతోషం కోసమో.. ఇలా చాలా కారణాల వల్ల అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు. కొందరైతే ఒకరితో ప్రేమ వ్యవహారం, వివాహేతర సంబంధం పెట్టుకుని మరొక అమ్మాయిని పెద్దల నిర్ణయంతో పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి మగాళ్ల వల్ల అమ్మాయిలకు జీవితంలో సంతోషం అనేది ఉండదు. జీవితాంతం వారు అత్తమామల సూటిపోటి మాటలు, భర్త నిర్లక్ష్యం మద్య సంతోషం అనేది లేకుండా బ్రతికేస్తారు. ఇన్ని కారణాల వల్ల అమ్మాయిల జీవితాలు గందరగోళంలో పడి నాశనమవుతున్నాయి.
*రూపశ్రీ.