తప్పటడుగులకి సరిహద్దు.. భవిష్యత్తుకి సరికొత్త ఆరంభం... ఈ కొత్త సంవత్సర రాత్రి వేడుక..

 


కొత్త సంవత్సరం రాబోతుందన్నప్పుడు ముందు రోజు నుంచే చాలామందిలో ఎంతో ఉత్సాహం వచ్చేస్తుంది. ఫ్రెండ్సుతో పార్టీలు, ఫ్యామిలీతో  షోలు  ఇలా ఏవేవో చేసుకోవాలనే ప్లాన్స్ వేసేసుకుంటారు. ఈ రాత్రిని ఒక ఎంజాయ్ మెంట్ టైముగా చూసే వారు కొందరుంటే, తమ జీవితాల్లో నుంచి ఇంకో సంవత్సరం జారిపోతుంది, ఇకనైనా భవిష్యత్తు బాగుపడే రోజులు వస్తాయా అనే ఆలోచనలో మరికొందరు ఉంటారు.

ఈ రోజులో ఏముంది ప్రత్యేకం? సంవత్సరంలో మిగతా రోజుల్లానే ఇది కూడా ఒకటే కదా..  ఆలోచించి చూస్తే దేనికయినా ఒక ఆరంభం,  ఒక హద్దు, ఒక ముగింపు ఉంటాయి. చాలామంది ఒక పనిని ఆరంబించటానికో,  ఆ హద్దు వరకు చేయటానికో.. ఆ హద్దు దాటి  ముందుకు వెళ్లడానికో చూస్తుంటారు కదా... అలాంటప్పుడు రెండు సంవత్సరాల మద్య సరిహద్దుగా ఉన్న ఈ రోజు కొందరికి ఒక హద్దుగా, ఇంకొందరికి ఒక కొత్త ఆరంభంగా కనిపించి ఒక నూతన ఉత్తేజం కలిగిస్తుంది. చెడ్డ అలవాట్లు, తప్పుడు నిర్ణయాలు, చేసిన  పొరపాట్లు ఇలా మనల్ని జీవితంలో వెనక్కి లాగే విషయాలని దూరం చేసుకోవాలనే  సంకల్పం చేసుకోనే దిశగా.. భవిష్యత్తుని బాగు చేసే కొత్త ఐడియాలు, మంచి అలవాట్లు వంటి వాటికి ఆరంభంగా ఉన్న ఈ రోజు ఎందరో జీవితాలకి మలుపు అవుతుంది.

పాత సంవత్సరం చివరి రోజున, మనం గత సంవత్సరంలో జరిగిన సంఘటనలను అన్నీ గుర్తు చేసుకుంటూ, వాటి నుండి నేర్చుకున్న పాఠాలను గుర్తించి, కొత్త  ఆశలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాము. ఈ రాత్రి మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది - "ఎప్పుడూ ముందుకు పోతూ ఉండు, పాత బాధలను మర్చిపోయి, అవి నేర్పిన పాఠాలు మాత్రం గుర్తుంచుకుని విజయం వైపు కొత్త అడుగులు వేయి, లేదంటే కాలం కథలో వెనకబడిపోతావు” అని. ఎందుకంటే కాలం ఎవరికోసమూ  ఆగదు.

కొత్త సంవత్సరం పలకరించబోతున్న ఈ సమయంలో    పాత బాధలను, త్యాగాలను, తప్పులను వదిలిపెట్టి ఒక సరికొత్త ఆరంభంలా  భావించి ప్రతి ఒక్కరూ  ఒక కొత్త దిశగా అడుగులు వెయ్యాలనుకుంటారు.  తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త లక్ష్యాలను పెట్టుకొంటారు. ఇప్పటి యువత ‘న్యూ ఇయర్ రిజల్యూషన్స్’ అని  తమ జీవితాన్ని ప్రభావితం చేసే ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు ఈ రోజే చేస్తారు.  ఒక కొత్త అవకాశంగా మారే ప్రతీ రోజుని  అందుకోవటానికి సిద్ధమవుతారు.

గ్రెగోరియన్  క్యాలెండర్‌ ప్రకారం  ప్రపంచమంతటా డిసెంబర్ 31వ తేదీన వివిధ సంప్రదాయాల్లో  నూతన సంవత్సర ఉత్సవం జరుపుకుంటారు. మన దేశంలో కూడా ఈ రోజున జరుపుకుంటారు. కానీ  భారత దేశం చుట్టు ఉన్న దేశాల భోగోళిక స్థితి, సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం కొత్త సంవత్సర వేడుకలు మార్చ్ చివరి రెండువారాల్లోనో లేదా ఏప్రిల్ మొదటి రెండు వారాల్లోనో జరుపుకుంటుంటారు. ప్రతి ప్రాంతం వారి సంస్కృతి, నమ్మకాలు, ఆచారాల ప్రకారం ఈ సంప్రదాయాలు విభిన్నం గా ఉంటాయి. అయితే ఏ ప్రాంతమైనా, ఏ సమయమైనా,   ఏ సాంప్రదాయం ప్రకారం చూసినా అన్నింటిలోనూ ప్రజలకి ఉండే కోరిక, ఉద్దేశ్యం ఒక్కటే.. “తమ జీవితాల్లో అంతవరకు ఉన్న పాత సమస్యలు, బాధలు తొలగిపోయి కొత్త అవకాశాలు, ఆనంద క్షణాలు రావాలని.

ఈ కొత్త సంవత్సర రాత్రిన  చాలామంది  పుట్టిన రోజు వేడుకలు కూడా చేసుకుంటారు. అందరూ కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొత్తగా   పరిచయమైనవాళ్లతో కలిసి పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ఎంజాయ్మెంట్లో తమ పాత భాధలు మర్చిపోయి, కొత్త ఆశలు, కోరికలు, కొత్త ప్రయత్నాలు అనుకుంటూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం చెప్తారు.  దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి, విందు  వినోదాలలో మునిగి, ప్రేమాభిమానాలు, సుఖసంతోషాలు  పంచుకుంటారు. ప్రతి ఏడాది వస్తుంది.. తనతో బోలెడు కాలాన్ని ప్రతి వ్యక్తి చేతిలో పెడుతుంది.  ఏడాది పొడుగునా బోలెడు అనుభవాలు, బోలెడు పాఠాలు అందరికీ చెబుతుంది.  ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి మూలమవుతుంది. ఈ కొత్త ఏడాది కూడా అందరికీ మంచి చేకూర్చాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం.  ప్రపంచ దేశాలన్నీ ఒక కుటుంబంలా భావిస్తే, కుటుంబ కలహాలు తొలగిపోయి, మన భూమాత ఇంట అంతా ఆనందమే తాండవమాడుతుంది.  పాత ఏడాదికి వీడ్కోలు చెప్తూ.. కొత్త ఏడాదిని ఆశతో ఆహ్వానిద్దాం.


                                          *రూపశ్రీ.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu