టెస్ట్ చరిత్రలో విండీస్ చెత్త రికార్డు.. 27 పరుగులకే ఆలౌట్

టెస్ట్ క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ చెత్త రికార్డ్ నమోదు చేసింది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో విండీస్ రెండో అత్యల్ప స్కోరు చేస్తే... ఆస్ట్రేలియా టీమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్‌ను కేవలం 27 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇది టెస్ట్‌ల్లో రెండో అత్యల్ప స్కోరు. జమైకాలోని కింగ్‌స్టన్‌ వేదికగా మూడో టెస్ట్‌ లో 175 పరుగులతో కంగారూ జట్టు విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్ క్లీన్‌ స్వీప్ చేసింది.  కెరీర్‌లో వందో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న మిచెల్ స్టార్క్ భీకర బౌలింగ్‌తో విండీస్‌ బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించాడు. స్టార్క్ 6 వికెట్లు తీయగా.. బొలాండ్ 3 (హ్యాట్రిక్), హేజిల్‌వుడ్ ఒక వికెట్ తీశారు. ఆసీస్ బౌలర్ల  దెబ్బకు ఏకంగా ఏడుగురు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. గ్రేవిస్ అత్యధికంగా 11 పరుగులు చేయగా.. మైకేల్ లూయిస్, అల్జారీ జోసఫ్ తలో 4 పరుగులు చేశారు.
 స్పార్క్ తన మొదటి ఓవర్‌లో మూడు వికెట్లు తీశాడు. మొత్తం  15 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. ఆ క్రమంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో 5 వికెట్టు సాధించిన బౌలర్‌గా స్టార్క్ రికార్డు సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కంగారూలను 121 పరుగులకు ఆలౌట్ చేసి సంబరపడిన విండీస్‌కు ఆ ఆనందం ఎంతో సేపు నిలబడలేదు. విండీస్ బ్యాటర్లలో ఏడుగురు డకౌట్ అయ్యారు.

టెస్ట్ చరిత్రలో 1955లో ఇంగ్లాండ్‌పై 26 పరుగులకే అలౌట్ అయిన న్యూజిలాండ్ అత్యల్ప స్కోర్లలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. మళ్లీ ఇంత కాలానికి విండీస్ ఆ చెత్త రికార్డుకు చేరువై రెండో అతి చెత్త ఇన్నింగ్ ఆడింది. మన భారత్ 2020లో ఆస్ట్రేలియాపై 36 పరుగులకు ఆలౌట్ అయి ఆ చెత్త రికార్డుల్లో 8వ స్థానంలో ఉంది.