బీహార్ టు త‌మిళ‌నాడు.. ఓట‌ర్ల మార్పు చేర్పుల గొడ‌వేంటి?

బీహార్ లో 65 ల‌క్ష‌ల ఓట్లు గ‌ల్లంత‌య్యే ప్ర‌మాదంలో  ఉంటే..  త‌మిళ‌నాడులో ఆరున్న‌ర ల‌క్ష‌ల ఓట్లు కొత్త‌గా వ‌చ్చి చేరాయ‌ట‌. ఈ ఓట్లు ఎక్క‌డివాని చూస్తే ఇవి వ‌ల‌స వ‌చ్చిన వారివిగా తెలుస్తోంది. ఇదెలా సాధ్యం అని ప్ర‌శ్నిస్తున్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, ఎంపీ, మాజీ మంత్రి చిదంబ‌రం. ఎందుకంటే వ‌ల‌స వ‌చ్చిన‌ వాళ్ల‌కు ఇక్క‌డేం జ‌రుగుతుందో తెలీదు. ఇక్క‌డి రాజ‌కీయాలు అస‌లే ప‌ట్ట‌వు. వారిది త‌మ‌దీ వేరు వేరు భావ‌జాలాలు. అలాంటి భావ‌జాలం సూటు కాని వారు ఇక్క‌డ క‌నీసం ఇల్లూ వాకిలీ కూడా లేకుండా... ఓటు హ‌క్కు పొంద‌డం అంటే అది ఇక్క‌డి రాజ‌కీయాల‌ను తీవ్ర ప్ర‌భావితం చేయ‌డ‌మేనంటున్నారు చిదంబరం. 

ఇప్పుడు కొత్త‌గా న‌మోదు చేసిన ఈ ఓట‌ర్ల‌కు బీహార్ రాజ‌స్థాన్ వంటి ప్రాంతాల్లో ఖ‌చ్చితంగా సొంతిల్లు ఉంటుంది. ఎక్క‌డ సొంతిల్లుంటే అక్క‌డ వారికి ఓటు హ‌క్కు ఉన్న‌ట్టు లెక్క‌. అలాంటి హ‌క్కును వాడుకోవ‌ల్సింది పోయి.. ఇలా ఇక్క‌డే ఉన్నారు క‌దాని వారికి ఓటు హ‌క్కు క‌ల్పించ‌డమేంటి? అన్న‌ది చిదంబ‌రం ప్రశ్న.  ఈ విష‌యంపై ఆయ‌న సీఎంవోను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్  చేశారు. ఈసీపై మ‌నం రాజ‌కీయంగానే కాదు, చ‌ట్ట ప‌రంగానూ పోరాడాల్సి ఉంద‌ని అన్నారు. ఇక డీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఒక‌రు.. అవును ఇది స‌మంజ‌సం కాదు. ఈ ఓట్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. 
ఇక బీహార్ ప‌రిస్థితి చూస్తే తమిళనాడుకు పూర్తి భిన్నంగా ఉంది.  ఇక్క‌డ చివ‌రి ఓట‌రు జాబితా ప‌రిశీల‌న జ‌రిగింది 2003లో. ఆ త‌ర్వాత జ‌ర‌గ‌నే లేదు. అందువ‌ల్ల అప్ప‌టి ఓట‌ర్లు ఇప్పుడెవ‌రున్నారో తెలీద‌ని చెబుతోంది ఈసీ. కొంద‌రు వీరిలో చ‌నిపోయిన వారు కూడా ఉన్నార‌ని.. దీంతో వీరంద‌రినీ తొల‌గించాల్సి ఉంద‌నీ చెబుతోంది. అలాగే బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చిన వారు కూడా ఇక్క‌డి ఓట‌ర్ల‌లో క‌ల‌గ‌ల‌సి పోయార‌నీ..  8 కోట్ల ప్ర‌జ‌లున్న బీహార్ అంటే జాతీయ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే రాష్ట్రం. కాబ‌ట్టి తామీ విష‌యం ఒక సవాలుగా తీసుకుని ప‌ని చేస్తున్న‌ట్టు ఈసీ చెబుతోంది. 

అయితే ఈ విష‌యం మీద ఇటు ఆర్జేడీ వంటి పార్టీల‌తో పాటు పౌర సంఘాలు కూడా కోర్టుల‌కెక్కాయి. అయితే సుప్రీం కోర్టు స‌ర్ గా పిలిచే ఈ స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ కి సుప్రీం అనుమ‌తించింది. అంతే కాదు.. డాక్యుమెంటేష‌న్ విధానం స‌రిగా అమ‌లు చేయాల‌ని సూచించింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ మీ ఐడీ కార్డుల‌ను చూపించి ఓటర్ల జాబితాలో చోటు ద‌క్కించుకోవాల‌ని అంటోంది. అది సాధ్యం కాని ప‌ని. గ్రామీణ బీహార్ లో చాలా వ‌ర‌కూ స‌రైన ధృవీక‌ర‌ణ ప‌త్రాలు లేని వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు వీరి ఓటు హ‌క్కు ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఇలా జ‌రుగుతుంద‌ని తాము అస్స‌లు ఊహించ‌లేద‌ని మండి ప‌డుతున్నాయి ప్ర‌జా సంఘాలు. కార‌ణం ఇలా నిరూపించుకోవాలంటే కొంద‌రికి సాధ్య‌మ‌య్యే పనే కాదు. ఎందుకంటే ఇప్ప‌టికీ కుల, ఆదాయ వంటి సాధార‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాలే స‌రిగా ఇవ్వ‌డం లేదు. వారొక ప‌క్క ఇవ్వ‌క- వీరొక ప‌క్క తీసుకోలేక మీ పౌర‌స‌త్వం నిరూపించుకున్నాకే మీకు ఓటు అంటారు. త‌ర్వాత దేశ బ‌హిష్క‌ర‌ణ చేస్తారంటూ తీవ్ర స్థాయిలో మండి పుడుతున్నారు పౌర సంఘాల నేత‌లు. 

తాజా ప‌రిస్థితులేంట‌ని చూస్తే ఆర్జేడీ యువ‌నేత తేజ‌స్వీయాద‌వ్ కి ఈసీ నోటీసులు జారీ చేసింది. మీరు ఓట‌రు జాబితాలోంచి తొల‌గించామ‌ని చెబుతున్న కార్డు ఈసీ జారీ చేసిందికాదంటూ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆయ‌న‌కే రివ‌ర్స్ లో కౌంట‌ర్ వేసింది. దీంతో ఈ నెల 8న ఇండియా కూట‌మి ఈసీ వ‌ద్ద‌కు ర్యాలీ తీయ‌నుంది. 

ఇక రాహుల్ గాంధీ సైతం శ‌నివారం పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో 70 నుంచి వంద స్థానాల వ‌ర‌కూ ఎన్డీయే గెలిచే ఛాన్సే లేద‌ని అన్నారాయ‌న‌. మోడీ కూడా స‌రైన మెజార్టీతో గెల‌వ‌లేదు. 15 సీట్ల తేడాతో అస‌లు ఎన్డీయే తిరిగి అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశ‌మే లేద‌ని బాంబు పేల్చారు రాహుల్. మ‌రి చూడాలి ఈ ఓట్ల గొడ‌వ ఎక్క‌డ తేలుతుందో .

Online Jyotish
Tone Academy
KidsOne Telugu