ఫిర్ ఏక్ బార్ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ !
posted on Aug 4, 2025 10:45AM
.webp)
పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని, సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టమైన గడవు విధించిన నేపధ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అత్మరక్షణలో పడిందా? అందుకే ఏదో విధంగా ఈ గండం నుంచి కట్టేక్కేందుకు వ్యూహాలు రచిస్తోందా? మళ్ళీ మరోమారు ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టిని కేంద్రీకరించిందా? అంటే హస్తం పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఫిరాయింపుల నిరోధక చట్టం ఉచ్చు నుంచి తప్పించుకునేదుకు అవసరమైన మేరకు మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు మరోమారు ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించేందుకు కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రస్తుతానికి అది కూడా ఒక ఆప్షన్ గా మాత్రమే పార్టీ నాయకత్వం భావిస్తోందంటున్నారు. పార్టీ ఫిరాయించిన పెద్దలను కాపాడేందుకు అదొక్కటే మార్గం అని మాత్రం అనుకోవడం లేదని అంటున్నారు.
అయితే.. ప్రస్తుత రాజీకీయ వాతావరణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరేంతటి సాహసం చేస్తారా? తెలంగాణ రాజకీయాల్లో అనిశ్చితి పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ప్రస్తుత సమయంలో తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రలోభాలకు లొంగి రాజకీయ భవిష్యత్ ను ఫణంగా పెట్టేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సాహసిస్తారా? అంటే రాజకీయ విశ్లేషకులు అనుమానమే అంటున్నారు.
అదలా ఉంటే.. ప్రస్తుత లెక్కల ప్రకారం బీఆర్ఎస్. శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్ శాసనసభా పక్షంలో విలీనం చేసుకోవాలంటే మరో 16మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేయవలసి ఉంటుంది. గత 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. అయితే.. 2024లో జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జూబ్లీ హిల్స్ ఎమ్మల్యే మాగంటి చనిపోవడంతో ఆ సీటు ఖాళీగా వుంది. ఇక పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు.
అదలా ఉంటే, ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా పార్టీ ఫిరయిస్తేనే అనర్హత వేటు నుంచి తప్పించుకోగలరు. కాదంటే వేటు పడుతుంది. ఆ లెక్కన, అనర్హత వేటు తప్పాలంటే, మరో 16 (మొత్తం 26) మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరవలసి ఉంటుదని అంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితిలో ఒకేసారి 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటే కాంగ్రెస్ నాయకులు అదెంత పని చిటికేస్తే పోలో మంటూ వచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ గా ఉన్నారని అంటున్నారు. నిజానికి సుప్రీం కోర్టు తీర్పు కోసం కాంగ్రెస్ నాయకత్వం, ఆపరేషన్ ఆకర్ష్ కు చిన్న విరామం ఇచ్చిందే తప్ప శాశ్వతంగా చుక్కపెట్టలేదని అంటున్నారు. నిజానికి.. గతంలోనే పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆపరేషన్ ఆకర్ష్ ఒక నిరంతర ప్రక్రియ.. ఎప్పుడూ ఆగదని చెప్పారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మా పార్టీలోకి వస్తానంటే తీసుకుంటాం.. అందులో తప్పేముందని అన్నట్లు చెపుతున్నారు.
అయితే.. విశ్వసనీయ సమాచారం ప్రకారం,ఆపరేషన్ ఆకర్ష్ పునరుద్దరణకు సంబంధించి, కాంగ్రెస్ పెద్దలు ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నమ్మి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేను అనర్హత వేటు నుంచి తప్పించేందుకు ఉన్న న్యాయపరమైన ప్రత్యామ్నాయాలపై న్యాయ, రాజ్యాంగ నిపుణులతో చర్చించి.. మరో మార్గం లేనప్పుడు మాత్రమే ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగించాలని పార్టీ పెద్దలు అలోచిస్తున్నట్లు చెపుతు న్నారు.అయితే.. ఒక్క బీఆర్ఎస్ నుంచే కాదు, ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ సిద్ధాంతాలు, రాహుల్ గాంధీ నాయకత్వం నచ్చి వస్తామంటే.. గాంధీ భవన్ తలుపులు ఎప్పుడూ తెరచే ఉంటాయని, పార్టీ పెద్దలు చెప్పడం కొసమెరుపు.