ఒక ప్ర‌స్తానం ముగిసింది.. గురూజీ శిబూ సొరేన్ ఇక లేరు!

గురూజీ అని అంద‌రి చేత ప్రేమగా పిలిపించుకునే జార్ఖండ్ ముక్తి మోర్చా వ్య‌వ‌స్థాప‌కుడు శిబూసోరెన్ ఇక లేరు. 81 ఏళ్ల వ‌య‌సులో వృద్దాప్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆయ‌న ఢిల్లీలోని గంగారాం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు.  ఈ విష‌యాన్ని జార్ఖండ్ సీఎం, శిబుసొరేన్ త‌న‌యుడు, హేమంత్ సొరేన్ త‌న‌ ఎక్స్ పోస్ట్ ద్వారా తెలియ చేశారు.  దిశోమ్ గురూజీ మ‌న‌ల్ని విడిచి వెళ్లిపోయారు. ఇవాళ త‌న‌కంతా శూన్యంగా క‌నిపిస్తోంద‌ని త‌న పోస్టు లో తీవ్ర విషాదం వ్య‌క్తం చేశారాయ‌న‌. జార్ఖండ్ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌లో, గిరిజ‌న స‌మ‌స్య‌ల పోరాటంలో, మ‌డ‌మ తిప్ప‌ని పోరాట యోధుడిగా.. శిబుసోరెన్ కి పేరుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న 8 సార్లు లోక్ స‌భ కు, రెండు సార్లు రాజ్య స‌భకు ఎన్నికైన శిబుసొరేన్ ,  జార్ఖండ్ సీఎంగా ఎన‌లేని సేవ‌లందించారు. 

చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు పెద్ద ఎత్తున మ‌ద్ధ‌తునిచ్చిన శిబుసొరేన్ తెలంగాణ‌కు సైతం ఆత్మీయులే. ఈ విష‌యం ప్ర‌స్తావిస్తూ త‌న నివాళి తెలియ చేశారు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. వ‌డ్డీ  వ్యాపారుల ఆగ‌డాలను అరిక‌ట్ట‌డంలో, మాద‌క ద్ర‌వ్యాల వ్యాపారుల‌పై పోరు స‌ల‌ప‌డంలో శిబుసోరెన్ త‌న‌దైన ముద్ర‌వేశార‌ని అన్నారు సీఎం రేవంత్. ఆదివాసీ స‌మాజానికి శిబు సోరెన్ చేసిన మేలు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేమని పేర్కొన్నారు. జార్ఞండ్ సీఎం హేమంత్ సోరెన్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు రేవంత్ రెడ్డి త‌న ప్ర‌గాఢ‌ సానుభూతి తెలిపారు.

జార్ఖండ్ లోని గొడ్డలో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మాట్లాడుతూ, తాను ఎంపీగా ఉన్న ప్రాంతం గురూజీ ప్రాంతమే. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయన ఆలోచనలతో ఎవరికైనా ఇబ్బంది కలిగిన సందర్భం లేదు. శిబు సోరెన్‌తో కలిసి ఎంపీగా పనిచేసే అవకాశం చాలా ఏళ్లు లభించింది. ఆయన ఎల్లప్పుడూ మాకు మార్గదర్శనం చేశారు. గొప్ప నేతను కోల్పోయామ‌ని అన్నారు.

2020లో రాజ్యసభకు ఎన్నికైన తర్వాత శిబు సోరెన్ రాజకీయాల్లో అంత యాక్టివ్ గా కనిపించలేదు. అయితే, ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి నిరంతరం మార్గదర్శనం చేస్తూ వ‌చ్చారు. శిబు సోరెన్ వయసురీత్యా వచ్చే సమస్యలతో బాధపడటమే కాకుండా, కిడ్నీ సంబంధిత సమస్యల కూడా ఆయనను వేధించాయి.  గత కొన్నాళ్లుగా శిబు సోరెన్ వీల్ చైర్ కే పరిమితమయ్యారు. జెఎంఎం జాతీయ సమావేశంలో కూడా ఆయన వీల్ చైర్లోనే వచ్చారు. శిబుసొరేన్ లోటు పూడ్చ‌లేనిదనీ, శిబు సొరేన్ లాంటి  మార్గ‌ద‌ర్శి గురువు త‌మ‌ను విడిచి వెళ్ల‌డం  పూడ్చలేని లోటని సాధార‌ణ ప్ర‌జ‌లు అభిప్రాయ ప‌డుతున్నారు. ఆయ‌న‌కు  ఘ‌న నివాళులు అర్పిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu