కేసీఆర్ కోసమే ఆ గాయాన్నికెలికారా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, నిన్న (సోమవారం) లోక్ సభలో, ఈరోజు (మంగళవారం) రాజ్యసభలో, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ, విమర్శలు గుప్పించారు. వ్యంగ్యాస్త్రాలతో విరుచుకు పడ్డారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, జనవరి 31న  పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చే సందర్భంలో మోడీ, ఇతర పార్టీలు అన్నింటినీ పక్కన పెట్టి ఒక్క కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు. వందేళ్ళ వరకు మళ్ళీ అధికారంలోకి రారాదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుందని వ్యంగ్య బాణాలు సందించారు. ధన్యవాదాల తీర్మానంపై చర్చను ప్ర్రంభించిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ,వందేళ్ళ అయినా బీజేపీ తమిళనాడులో అధికారంలోకి రాలదు అంటూ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా మోడీ, తమిలనాడు సహా ఏఏ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఎంతెంత కాలంగా, ఎన్నెన్ని దశాబ్దాలుగా అధికానికి దూరంగా వుందో చదివి వినిపించారు. కాంగ్రెస్ పార్టీ, వరస ఓటముల నుంచి గుణ పాఠం నేర్చుకోలేదని, అహంకారం చంపుకోలేదని ఘాటైన విమర్శలు చేశారు. 

కాంగ్రెస్ పార్టీని విమర్శించే క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ విభజన అంశాన్ని ఒకసారి కాదు రెండు సందర్భాలలో ప్రముఖంగా ప్రస్తావించారు. బీజేపీ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదంటూనే, రాష్ట్ర విభజన జరిగిన తీరును ఇన్నేళ్ళ తర్వాత తప్పు పట్టారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు, అటల్ బిహారీ వాజపేయి హయాంలో ఎలాంటి రగడ,రాధ్హంతం లేకుండా మూడు రాష్ట్రాల విభజన, మూడు కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరిందని అన్నారు. ఒక పద్దతి ప్రకారం అందరితో ప్రజాస్వామ్య బద్ధంగా చర్చించి జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్  విభజన, అందుకు భిన్నంగా జరిగిందని అన్నారు. అందుకే రాష్ట్ర విభజన జరిగిన ఇన్నేళ్ళ తర్వాత ఇప్పటికి కూడా, రెండు రాష్ట్రాలు నష్ట పోతున్నాయని, మోడీ రాజ్య సభలో సంచలన రాజకీయ వ్యాఖ్యలు చేశారు. 

“‘తెలంగాణ ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు. వాజ్‌పేయీ ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. శాంతియుతంగా అందరూ కలిసి కూర్చుని, చర్చించి ఆ రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను పాస్‌ చేశారు. కానీ ఏపీ, తెలంగాణ విషయంలో అలా జరగలేదు. నాడు కాంగ్రెస్‌ హయాంలో సభలో మైకులు ఆపేశారు. కాంగ్రెస్‌ సభ్యులు పెప్పర్‌ స్ప్రే కొట్టారు. ఎలాంటి చర్చ లేకుండా ఏపీని విభజించారు. విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయి. కాంగ్రెస్‌ అహంకారం, అధికార కాంక్షకు ఇదే నిదర్శనం. ఏపీ విభజన తీరు సరిగా లేదు. సరిగా విభజన జరిగి ఉంటే రెండు రాష్ట్రాలకు సమస్యలు వచ్చేవి కావు’’ అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోదీ దుయ్యబట్టారు.

అంతకు ముందు లోక్ సభలోనూ ప్రధాని మోడీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూసిందని, అయితే, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్’ పార్టీని ఆదరించ లేదని అన్నారు. “తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మీరు క్రెడిట్ తీసుకుందామనుకున్నారు కానీ అక్కడి ప్రజలు మిమ్మల్ని అంగీకరించలేదని”కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మోడీ అన్నారు’. 

అయితే, తెలంగాణలో తెరాస,బీజేపీల మధ్య యుద్ద వాతావరణం నెలకొని ఉన్న సమయంలో   ప్రధాని మోడీ, ఇలాంటి సంచలన వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేశారు, అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంసమైంది. ఏదో విధంగా తెలంగాణ సెంటిమెంట్’ ను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్న సమయంలో, మోడీ చేసిన వ్యాఖ్యలు తెరాస అంబుల పొదిలో మరో అస్త్రంగా మారే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు. అలాగే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా చేసేందుకు, మోడీ, కేసీఆర్ మధ్య సీక్రెట్ డీల్ నడుస్తోందని, సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు నిజమని మోడీ వ్యాఖ్యలు నిరుప్సితున్నాయని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అలాగే, మోడీ వ్యాఖ్యలు రాష్ట్రంలో బీజేపీకి ఇబ్బందికరంగా మారతాయని, ఆపార్టీలోనే చర్చ మొదలైంది. అంతిమంగా ఈ చర్చ ఎటు దారి తీస్తుందో ..ఎవరికి లాభిస్తుందో చూడవలసి ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu