బీజేపీ మేనిఫెస్టోలో ఉచితాలకు పెద్ద పీట
posted on Feb 8, 2022 2:54PM
ఓటమి భయమే కారణమా?
ఉచితాలకు కొంచెం దూరంగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే, అది బీజేపీ ఒక్కటే.. బీజేపీకి ఉచిత వరాల మీద, జనాకర్షక పథకాల మీద అంతగా నమ్మకం లేదు, అంటారు, ఆపార్టీ అభిమానులు. కార్యకర్తలు. అలాగే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు, ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్’ ను తాయిలాలు లేకుండా సాదా సీదాగా ప్రవేశ పెట్టడం, ప్రధాని మోడీ ప్రభుత్వం పాటిస్తున్న ఆర్ధిక క్రమ శిక్షణకు నిదర్శనమని, జేపీ వంటి మేథావులు కూడా సర్కార్’కు కితాబు నిచ్చారు.
అయితే, ఇంతవరకు ఏమో కానీ, ఇప్పుడు బీజేపీ కూడా, జనాకర్షక పథకాలకు ఉచిత వరాలకు జై కొట్టేందుకు సిద్దమై పోయిందా అంటే, ఈరోజు (మంగళ వారం) కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా విడుదల చేసిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రణాళిక అవుననే అంటోంది. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో అమిత్ షా, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.ఈ సందర్భంగా, బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే, 5వేల కోట్ల రూపాయలు వెచ్చించి చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, రైతులు పండించిన వరి, గోధుమలకు మద్ధతుధర కల్పిస్తామని చెప్పారు. బాగుంది. అదే క్రమంలో వచ్చే ఐదేళ్లలో రైతులందరికీ వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. సమాజ్ వాదీ పార్టీ, రైతులకే కాదు, గృహోపయోగానికి కూడా 300 యూనిట్ల వరకు ఉచిత విధ్యత్ ప్రకటించిన నేపధ్యంలో బీజేపే రైతులకు మాత్రమే ఉచిత్ విద్యుత్ ఆఫర్ చేయడం కొంతలో కొంత బెటర్ కావచ్చును, కానీ, అదొక్కటే కాదు,బీజేపీ మేనిఫెస్టోలో ఉచితాలు ఇంకా ఉన్నాయి. బహుశా ఓటమి భయం వలన కావచ్చు బీజేపీ కూడా, ఎస్పీకి పోటీగా ఉచిత వరాలను ప్రకటించింది.
అందులో, కళాశాలల్లో చదివే విద్యార్థినులకు ఉచితంగా ద్విచక్రవాహనాలు ఉచితంగా ఇస్తామని, బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. 60 ఏళ్లు పైబడిన మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.దీపావళి, హోలి పండుగల సందర్భంగా ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లను ఇస్తామని బీజేపీ హామీలిచ్చింది. యూపీలో 6 మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేస్తామని అమిత్ షా వివరించారు. అంటే, బీజేపీ కూడా మెల్ల మెల్లగా, ఉచితాల విషయంలో,బీజేపీ కూడా ‘జాతీయ జీవన స్రవంతి’ లో చేరుతోందని అనుకోవచ్చును అంటున్నారు.