అంబానీని దాటేసిన అదానీ.. ఆసియాలోనే రిచెస్ట్ పర్సన్..
posted on Feb 8, 2022 3:54PM
భారత కుబేరుడు అనగానే ముకేశ్ అంబానీనే గుర్తొస్తారు. దశాబ్ద కాలంగా ఆయనే రిచెస్ట్ పర్సన్. అలాంటిది ఏడాది కాలంలోనే అంబానీని దాటేశారు అదానీ. గౌతమ్ అదానీ ప్రస్తుతం ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్, ఫోర్బ్స్ రియల్‌టైం బిలియనీర్స్ జాబితాల ప్రకారం.. ఇప్పుడు సంపదలో అంబానీ కంటే అదానీనే ముందున్నారు. కాకపోతే, ఆ తేడా స్వల్పమే. ముందుముందు మళ్లీ ర్యాంకులు తారుమారు కావొచ్చు.
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గౌతత్ అదానీ 88.5 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో పదో స్థానంలో ఉన్నారు. అంబానీ 87.9 బిలియన్ డాలర్లతో 11వ స్థానంలో కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ రియల్‌టైం బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం చూస్తే అదానీ 91.2 బిలియన్ డాలర్లలో పదో స్థానంలో, 89.3 బిలియన్ డాలర్లతో అంబానీ 11వ స్థానంలో కొనసాగుతున్నారు.
ప్రధాని మోదీ, సీఎం జగన్ తదితరుల సాయంతో వ్యాపారంలో వేగంగా ఎదిగారు. ఏపీలో పలు పోర్టులను చేజిక్కించుకుంది అదానీ గ్రూప్. కరోనా సంక్షోభంలోనూ అదానీ సంపద రాకెట్‌లా దూసుకెళ్లింది. గౌతమ్ అదానీ గతేడాది రోజుకు రూ.1000 కోట్లకు పైగా ఆర్జించారని హురున్ నివేదిక తెలిపింది. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.10 లక్షల కోట్లకు చేరగా.. గౌతమ్ ఆధ్వర్యంలో రూ.లక్ష కోట్లకు పైగా విలువైన కంపెనీలు 5 ఉన్నాయి. గడిచిన తొమ్మిది నెలల కాలంలోనే.. అదానీ నికర సంపద డబుల్ అయినట్టు ఫోర్బ్స్ తెలిపింది. పోర్టులతో పాటు గ్రీన్ ఎనర్జీ, ఎయిర్‌పోర్ట్స్, గనులు, విద్యుత్తు కేంద్రాలు, ఎఫ్ఎమ్‌సీజీ గూడ్స్.. ఇలా పలు కీలక రంగాల్లోకి విస్తరించింది. ఫార్చ్యూన్ వంట నూనెలు అదానీ కంపెనీవే.
మరోవైపు, గడిచిన నెల రోజులుగా రిలయన్స్ గ్రూపునకు చెందిన ముకేశ్ అంబానీ సంపద 2 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. ఫ్యూచర్ గ్రూప్, సౌదీ ఆరామ్‌కోతో ఒప్పందాలు నిలిచిపోవడంతో రిలయన్స్ షేర్లలో ర్యాలీ కూడా ఆగిపోయింది. ఇదే సమయంలో అదానీ బిజినెస్ గ్రోత్ బాగుండటంతో.. ఆసియా కుబేరుడిగా అవతరించారు గౌతమ్ అదానీ.