సంతోషం ఎక్కడ ఉంది!

అనగనగా ఓ మంత్రిగారు. ఆయన రోజూ తన భవనం నుంచి రాజుగారి మహలుకి ఓ పల్లకీలో వెళ్తూ ఉండేవాడు. అలా వెళ్తూ ఉండగా, దారిలో కనిపించే ప్రజలను గమనించడం చాలా ఆసక్తిగా ఉండేది. వాళ్ల నడకలో ఉండే హడావుడి, వాళ్ల మొహాల్లో కనిపించే ఆందోళన చూసి ఆయన తెగ తృప్తి పడిపోయేవాడు. వాళ్లందరితో పోల్చుకుంటే తను ఎంత గొప్ప స్థితిలో ఉన్నానో కదా అని మురిసిపోయేవాడు. అలా కాలం గడిచిపోతూ ఉండగా, ఓ రోజు మంత్రిగారికి కొత్తగా వెలసిన గుడారం కనిపించింది. 

 

దాని పక్క నుంచి వెళ్తుంటే ఆ గుడారంలో కూర్చుని టోపీలు కుట్టుకుంటున్న ఓ నడివయసు మనిషి కనిపించాడు. మంత్రిగారికి అలాంటి దృశ్యాలు కొత్తేమీ కాదు. కానీ ఆ మనిషి మొహంలో కనిపించిన ప్రశాంతతే చాలా ఆశ్చర్యం కలిగించింది. ‘ఇవాళ ఏదో మంచి బేరం తగిలినట్లుంది. అందుకనే అంత సంతోషంగా ఉన్నాడు’ అనుకుంటూ ముందుకు సాగిపోయాడు మంత్రిగారు. కానీ చిత్రమేమిటంటే ఒక రోజు తరువాత మరో రోజు… ఆ టోపీల వ్యాపారి మొహంలో అదే రకమైన సంతోషాన్ని గమనించాడు మంత్రిగారు. 

 

ఇక ఉండపట్టలేక కొన్నాళ్లకి తన పల్లకీ దిగి గుడారంలోకి అడుగుపెట్టాడు. ‘ఏం పెద్దాయనా చాలా సంతోషంగా ఉన్నావు! బేరాలు అంత బాగుంటున్నాయా?’ అని పలకరించారు మంత్రిగారు. ‘బేరాలా! ఏదో అప్పుడొకటి అప్పుడొకటి వస్తున్నాయంతే!’ అన్నాడు వ్యాపారి చిరునవ్వుతో. ‘అయితే మీ కుటుంబంలో ఏదో శుభకార్యం ఉండి ఉంటుంది. అందుకనే అంత ఆనందంగా ఉన్నావు’ అని ఊహించాడు మంత్రి.

 

‘అలాంటిదేమీ లేదండీ! జీవనోపాధిని వెతుక్కుంటూ మా కుటుంబం అంతా తలో దిక్కున బతుకుతున్నాం. మేమంతా ఎప్పటికి కలుస్తామో కూడా మాకే తెలియదు!’ అని బదులిచ్చాడు వ్యాపారి. ‘ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు కదా పెద్దలు. బహుశా నీ ఆరోగ్యం చాలా బాగుండి ఉంటుంది. అందుకే ఇంత తృప్తిగా కనిపిస్తున్నావు’ అన్నాడు మంత్రి. ‘ఆరోగ్యమా! ఇదిగో ఈ చిల్లుల గుడారాన్ని చూస్తున్నారు కదా! పొద్దున్న పూట ఎండలో సగం నా మీదే పడుతుంది. ఇక రాత్రిళ్లు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ పడుకోవల్సిందే. ఆ చలికి పళ్లు పటపట కొరకడం వల్ల సగం పళ్లు ఊడిపోయాయంటే నమ్మండి!’ అంటూ చిరునవ్వుతో బదులిచ్చాడు వ్యాపారి.

 

వ్యాపారి జవాబులన్నీ విన్న మంత్రికి సహనం నశించిపోయింది. ‘డబ్బులు లేవు, కటుంబానికి దూరంగా దేశదిమ్మరిలా తిరుగుతున్నావు. ఇక ఆరోగ్యమా అంతంత మాత్రం. అలాంటిది ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావయ్యా!’ ‘మీకు తెలియంది ఏముంది మంత్రిగారూ! శారీరకంగానూ, మానసికంగానూ నేను ఎదుర్కొనే ప్రతి కష్టమూ జీవితంలో భాగమే అని నేను నమ్ముతాను. అలాంటి కష్టాలు ఎప్పుడూ నేను ఎదిగేందుకే ఉపయోగపడేవి. అందుకే నేనెప్పుడూ వాటికి భయపడలేదు. 

 

పైగా నాకు కష్టాన్ని ఇచ్చిన భగవంతుడే, దాన్ని సవాలుగా తీసుకుని దాటగల శక్తిని కూడా అనుగ్రహిస్తాడని నా నమ్మకం. కాబట్టి జీవితంలో ఎదురయ్యే ప్రతి ఇబ్బందినీ చిరునవ్వుతో ఎదుర్కొంటాను. ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోతే భగవంతునికి కృతజ్ఞత చెప్పుకొంటాను. లేకపోతే, మరింత శక్తిని ఇవ్వమని ఆయనను వేడుకుంటాను… అంతే!’ అంటూ ముగించాడు వ్యాపారి. వ్యాపారి మాటలకి మంత్రిలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి.