పిల్లలకు చదువు మీద ఏకాగ్రత ఉండట్లేదా? ఈ ఒక్క పని చేస్తే చురుగ్గా ఉంటారు..!
posted on Jul 17, 2024 9:30AM
పిల్లలు చక్కగా చదువుకోవాలన్నది ప్రతి తల్లిదండ్రి కోరిక. అందుకే పిల్లలున్న ప్రతి ఇంట్లో పిల్లల చదువుపట్ల ఆందోళన పడే తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదని ఎప్పుడూ పిల్లలను వేపుకు తింటూ ఉంటారు కూడా. పిల్లలు తల్లిదండ్రుల బాధ పడలేక పుస్తకం ముందు అయితే కూర్చొంటారు కానీ వారికి పుస్తకం మీద దృష్టి ఉండదు. ఒకవేళ చదువుకోవాలని దృష్టి పెట్టినా వారికి ఏకాగ్రత నిలవదు. పిల్లలకు ఏకాగ్రత నిలవడం లేదని తల్లిదండ్రులు లైట్ తీసుకోలేరు. అలాగని ఏం చేయాలో వారికి అర్థం కాదు. కానీ ఒకే ఒక్క పని చేయడం వల్ల పిల్లలు తిరిగి చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు. చదువులో చురుగ్గా ఉండగలుగుతారు. అదేంటో తెలుసుకుంటే..
పిల్లలు చదువు మీద దృష్టి పెట్టాలన్నా.. చదువులో చురుగ్గా ఉండాలన్నా, విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలన్నా, దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలన్నా ధ్యానం చక్కగా సహాయపడుతుంది. పిల్లలు ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..
పిల్లలు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ధ్యానం చేసినప్పుడు పిల్లల దృష్టి, ఏకాగ్రత మెరుగుపడుతుంది. పిల్లలు ధ్యానం చేయడం మొదలు పెట్టిన కొన్ని రోజులకే పిల్లలు చదువుపై బాగా దృష్టి పెట్టడం గమనించవచ్చు. ఇది పిల్లల జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.
ధ్యానం ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా మెరుగ్గా పని చేయడం, మెరుగ్గా చదువుకోవడం సాధ్యమవుతుంది. సమయాన్ని మెరుగైన రీతిలో నిర్వహించుకోగలుగుతారు. ధాన్యం చేసే పిల్లలు సమయపాలన నిర్వహించడంలో ఎప్పుడూ మెరుగ్గా ఉంటారు. దీని వల్ల చదువులో చురుగ్గా ఉంటారు.
ధ్యానం చేయడం వల్ల సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కేరింగ్ పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం, కృతజ్ఞతా భావం మొదలైనవి పెంపొందుతాయి. ఇది చదువులపై సానుకూల ప్రభావం చూపుతుంది.
ధ్యానం IQ స్థాయిని మెరుగుపరుస్తుంది. పరీక్షల సమయంలో మెరుగ్గా ఉండాలంటే ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ధ్యానం ఒత్తిడి, ఆందోళనను తగ్గించడం ద్వారా మనస్సును ప్రశాంతపరుస్తుంది.
ధ్యానం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ధ్యానం చేయడం ద్వారా మీరు క్రమశిక్షణ అలవడుతుంది. పిల్లలు పాఠాలు వినడం నుండి, ఏదైనా నేర్చుకోవడం, ఏదైనా పని చేయడం వరకు ప్రతి విషయంలో చాలా శ్రద్దగా ఓపికగా ఉండగలుగుతారు. ఇది వారిలో నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
*రూపశ్రీ.