భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే ఏం చేయాలి?
posted on Jul 18, 2024 10:43AM
రెండు విభిన్న మనస్తత్వాలు కలిసి జీవితం సాగించడం అంటే అది చాలా క్లిష్టమైన సమస్యే. కానీ వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను ఒక్కటి చేసి ఇద్దరూ కలసి బ్రతికేలా చేస్తుంది. అయితే ఒకే తల్లికి పుట్టిన బిడ్డలే ఒకరితో మరొకరు గొడవ పడుతూ ఉంటారు. అలాంటిది వేర్వేరు మనస్తత్వాలు ఉన్న వ్యక్తుల మధ్య గొడవ రావడం అనేది చాలా సాధారణ విషయం. గొడవ లేని భార్యాభర్తల బంధం అసలు ఉండదని చెప్పవచ్చు. కానీ గొడవ పడిన ప్రతి భార్యాభర్త విడిపోవడం అనే ఆప్షన్ వరకు వెళ్లరు. ఇప్పటి జనరేషన్ లో మాత్రం గొడవలు వర్షాకాలంలో వర్షం కురిసినట్టు ఎడాపెడా జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వారు విడిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. గొడవ జరిగినా సరే.. భార్యాభర్తలు విడిపోని పరిస్థితి రాకూడదు అంటే ఏం చెయ్యాలి?
ఏం చేయాలి?
గొడవ జరిగేటప్పుడు అవతలి వ్యక్తి ఏం చెప్తున్నారు అనేది శ్రద్దగా వినాలి. అవతలి వాళ్లు ఫిర్యాదులు చేస్తూ ఉండవచ్చు. సూచనలు ఇస్తూ ఉండవచ్చు. కానీ అవతలి వాళ్లు చెప్పేది వినాలి. వారు చెప్పేది నచ్చకపోతే అప్పుడు కోపంగా రియాక్ట్ అవ్వగుండా ప్రశాంతంగా రియాక్ట్ అవ్వాలి. మీ వైపు ఏదైనా తప్పు ఉంటే వెంటనే క్షమాపణ చెప్పాలి. భాగస్వామికి క్షమాపణ చెప్పే విషయంలో ఎప్పుడూ అహం చూపించకూడదు. ఒకవేళ భాగస్వామి ముందు చెప్పలేనంత కోపం వస్తే ఆ కోపాన్ని బయటకు వ్యక్తం చేయకుండా సింపుల్ గా నెంబర్స్ కౌంట్ చేయాలి. కోపం కంట్రోల్ లోకి వచ్చే వరకు ఇలా నెంబర్స్ కౌంట్ చేయడం వల్ల మైండ్ డైవర్ట్ అవుతుంది. కోపం కాస్తో కూస్తూ తగ్గుతుంది.
ఏం చేయకూడదు?
భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు కేకలు వేయకూడదు. అలాగే అరవకూడదు. గొడవను కూడా ప్రశాంతంగా మెల్లిగా మాట్లాడుతున్నట్టే పడాలి. అలా చేస్తే మీరు దేనికి బాధపడుతున్నారనే విషయాన్ని అవతలి వారు కూడా బాగా అర్థం చేసుకుంటారు. మీ మీద తిరిగి కోపం చేసుకోరు.
భార్యాభర్తలు గొడవ పడుతున్నప్పుడు ఆ గొడవల్లో పొరపాటున కూడా ఇరు కుటుంబ సభ్యుల గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి ఎత్తి చూపి మాట్లాడి విమర్శించకూడదు. ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవ ఇద్దరి గురించే ఉండాలి.
గొడవ జరిగేటప్పుడు ఒకరి గురించి మరొకరు చెడుగా మాట్లాడకూడదు. ఇది ఒకరి మీద మరొకరికి ఉండే మంచి అభిప్రాయం పోయేలా చేస్తుంది. కొన్ని సార్లు ఇలా చెడుగా మాట్లాడటం అనేది శాశ్వతంగా బంధం తెగిపోవడానికి కారణం అవుతుంది.
భార్యాభర్తల మధ్య ఏదైనా ఒక విషయం గురించి గొడవ జరిగి అది పరిష్కారం అయిన తరువాత తిరిగి అదే విషయం గురించి మళ్లీ గొడవ పడకూడదు. ఇది ఇద్దరి మధ్య బంధాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది.
మర్యాద ఉండాలి..
భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నట్టే గొడవలు కూడా వస్తాయి. అయితే భార్యాభర్తలు ఇలా గొడవ పడే విషయంలో కూడా మర్యాద మరచిపోకూడదు. ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉండాలి. ఎప్పుడూ మూడవ వ్యక్తి ముందు గొడవ పడకూడదు. గొడవలు జరిగేటప్పుడు ఒకరిని మరొకరు కించపరుచుకోకూడదు. వేళ్లు చూపించి మాట్లాడటం, వెక్కిరించి మాట్లాడటం, లోపాలను లేవనెత్తడం, చేతకాని వ్యక్తులనే అర్థం వచ్చేలా దూషించడం చేయకూడదు. ఇవన్నీ ముందే కూర్చొని మాట్లాడుకుని ఒప్పందం చేసుకోవాలి. ఇవన్నీ చేస్తుంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం కూడా తగ్గుతుంది. ఒకవేళ వచ్చినా భార్యాభర్తలు కొద్దిసేపటికే మాములుగా మారిపోతారు.
*రూపశ్రీ.