లెఫ్ట్ హ్యాండెర్స్ ఏ బెస్ట్ అచీవర్స్ అంట!

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్….. అంటాడు ఓ కవి. ఓడిపోవడం మాట అటుంచితే ఈ కుడి ఎడమ అయినందుకు అదృష్టమే ఎడమచేతిలో వచ్చి పడ్డట్టు అనిపిస్తుంది వివరాలు అన్నీ తెలిస్తే. 

సాధారణంగా ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏదైనా పని చేయాలన్నా ఇతర ఏ విషయాలలో అయినా కుడిచేయి వాడటం సహజం. కనీసం ఎదుటివారు పలకరించినపుడు ఆప్యాయంగా అందుకునే షేక్ హాండ్ అయినా సరే కుడిచేత్తో ఇవ్వడం ఒక సంస్కారం, ఇంకా చెప్పాలంటే అదొక గౌరవం కూడా. భోజనం, పూజలు పునస్కారాలు, దైవకార్యాలు, బట్టలు వేసుకునేటప్పుడు, ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి అనే సెంటిమెంట్ చాలా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు అక్షరాలు దిద్దడానికి బలపాన్ని కుడిచేత్తో కాక ఎడమచేత్తో పట్టుకున్నప్పుడు, అక్షరాలు ఎడమచేత్తో దిద్దుతున్నప్పుడు పిల్లలను చాలా వారిస్తారు. వారితో ఎడమచేతి అలవాటు మాన్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. 

కానీ అందరూ తెలుసుకోవలసినది ఏమిటంటే ఎడమచేతి వాటం తప్పేమీ కాదు. ఇంకా చెప్పాలంటే అదొక గొప్ప ప్రత్యేకత, అదొక అదృష్టం అంటున్నారు ప్రపంచ విశ్లేషకులు. 

ప్రతి సంవత్సరం ఆగస్ట్ 13 న ఎడమచేతివాటం ప్రజల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి సమస్యలు మొదలైన విషయాల మీద చర్చించాల్సిన అవసరం ఉంటుంది. బడిలో పిల్లలు పక్కపక్క కూర్చుని రాసుకునేటప్పుడు కుడి, ఎడమ చేతివాటం కలవారు పక్కపక్కనే ఉంటే చెప్పలేనంత ఇబ్బంది ఉంటుంది. సాధారణంగా ఈ ప్రపంచం మొత్తం మీద 90% మంది కుడిచేతివాటం కలవారు అయితే 10% మంది ఎడమచేతివాటం ఉంటారు. ప్రతి పదిమందిలో ఒకరు ఎడమచేతి వాటం వారుంటారని సర్వేలు తెలుపుతున్నాయి. కానీ కుడిచేతివాటం అనేది సాధారణం కాబట్టి, ఎడమచేతివాటం వారికి అక్కడక్కడా అవమానాలు, విమర్శలు ఎదురవుతుంటాయి. 

అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఎడమచేతివాటం వారే భవిష్యత్తులో గొప్ప స్థానానికి చేరుతారని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచం మొత్తం మీద ప్రముఖులుగా గుర్తింపబడిన వారిలో ఎడమచేతి వాటం వారు ఎక్కువగా ఉన్నారని చెబుతారు. దాదాపు 10 నుండి 12 శాతం మంది ఎడమచేతివాటం ప్రముఖులు ఉన్నారట.

ప్రత్యేకతలు!!

ఎడమచేతివాటం వారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అవే వారిని ఉన్నతమైన వారిగా మలుస్తాయని చెబుతారు. 

వీరిలో స్వతంత్ర్యభావాలు ఎక్కువ, జ్ఞాపకశక్తి, ఏదైనా సాధించాలనే పట్టుదల, ముఖ్యంగా గొప్ప సృజనాత్మకత వీరిలో ఉంటుంది.

గొప్ప లక్ష్యాలను ఏర్పరుచుకోవడమే కాదు, ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నాలు కూడా ఎంతో పట్టుదలతో చేస్తారు. ఇంకా చెప్పాలంటే కలలు కనడం వాటిని సాకారం చేసుకోవడం వీరిలో ఉన్న గుణం.

వీరు బహుముఖ ప్రజ్ఞను కలిగి ఉంటారు. ఒకేసారి ఎక్కువ పనులను చేయగల సత్తా వీరిలో ఉంటుంది. 

కళలు, భాష, సంగీతం వంటి రంగాలలో వీరు ఎక్కువ నైపుణ్యం కలిగిఉంటారట.

పైన చెప్పుకున్నవన్నీ వీరిలో ప్రత్యేకలు అయితే వీరు బొమ్మలు గీయడంలో ఎడమవైపు వంపులున్న చిత్రాలు బానే గీస్తారట, కానీ కుడివైపు వంపులున్నవి గీయడానికి కష్టపడతారట.

ఎడమచేతివాటం వారిలో మెదడు సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇంకా వీరు మానసిక రుగ్మతలతో ఎక్కువగా ఇబ్బంది పడుతారట.  

వారికున్న మరొక సమస్య ఏదైనా శుభకార్యాలు పండుగలప్పుడు వారు తొందరగా ఎడమచెయ్యి వాడేస్తుంటారు. అందరూ దాన్నేదో అపశకునంగా  భావిస్తారు. ఇదే వారికి పెద్ద సమస్య. 

కుడిచేతివాటం వారి కోసం తయారుచేయబడుతున్న ఎన్నో వస్తువులు ఎడమచేతివాటం వార సరిగా ఉపయోగించలేరు. ఈ కారణం వల్ల ప్రతి సంవత్సరం 2500 మంది ఎడమచేతి వాటం వారు మరణిస్తున్నారట. 

ఇవీ వీరి ప్రత్యేకతలు వీరు పడే అగచాట్లు. ఇకపోతే ఎడమచేతి వాటం వారిలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, సామాజిక, క్రీడా రంగాల్లో ఎందరో ప్రముఖులు ఉన్నారు. 

రాణీ లక్ష్మీబాయి, మహాత్మాగాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌, చార్లెస్‌ డార్విన్‌, న్యూటన్‌, బెంజిమిన్‌ ప్రాంక్లిన్‌, బిల్‌క్లింటన్‌, జార్జిబుష్‌, ఒబామా, రతన్‌టాటా, సచిన్‌ టెండూల్కర్‌, రవిశాస్త్రి, సౌరవ్‌గంగూలీ, యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా, శిఖర్‌థావన్‌, కుంబ్లే, జహీర్‌ ఖాన్‌, అమితాబచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, మహానటి సావిత్రి, సూర్యకాంతం, మమ్ముట్టి ఇలాంటి ప్రముఖులు ఉన్నారు. 

అందుకే మరి కుడి ఎడమ అయితే ఖంగారు వద్దు. పిల్లలు ఎడమచేతి వాటంగా తయారయ్యారని బెంగ వద్దు. కుదిరితే వాళ్లకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేసిపెట్టండి. ఏమో మీ పిల్లల పేరు ఏ ప్రముఖుల మధ్యనో చేర్చబడచ్చు.

                                     ◆నిశ్శబ్ద.