వరంగల్: పార్టీల్లో ధీమా... భయం!



వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక ముగిసింది. ఎన్నికల ముందు వరకు వివిధ పార్టీల నాయకుల మనసు ఒక రకంగా వుంటుంది. ఎన్నికల తర్వాత మరోలా మారిపోతుంది. ఎన్నికల ముందు పోటీలో వున్న అన్ని పార్టీల నాయకులు గెలుపు తమదేనన్న ధీమాను ప్రదర్శి్స్తూ వచ్చారు. గెలిచే అవకాశాలు ఎంతమాత్రం లేని వైసీపీ కూడా ఈ ఎన్నికలలో తమదే విజయం అన్నట్టుగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. ఇప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చేశారు... ఇక తీర్పు ప్రతి బయటకు రావడం మాత్రమే మిగిలి వుంది. ఈ మధ్య సమయంలో వివిధ పార్టీల నాయకులు ఎంత ధీమాగా వుంటున్నారో... అంత భయంగానూ వున్నారు.

అధికార టీఆర్ఎస్ ఈ స్థానంలో విజయం తమదేనన్న ధీమాను మొదటి నుంచి కనబరుస్తూనే వుంది. మిగతా పార్టీలన్నీ రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని చెప్పుకుంటూ వచ్చింది. అయితే ప్రభుత్వం మీద సహజంగా వుండే వ్యతిరేకత, టీఆర్ఎస్‌లో వున్న సమస్యల కారణంగానే ఉప ఎన్నిక వచ్చిందన్న విషయం తమకు విజయం దక్కకుండా చేసే ప్రమాదం వుందా అని ఆ పార్టీ నాయకులు మథన పడుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా విజయంపై ధీమాను ప్రదర్శి్స్తోంది. తెలంగాణ రావడానికి కారణం తమ పార్టీ చేసిన త్యాగాలే కారణమని ప్రజలు గ్రహించారని, అందుకే ఈ ఎన్నికలలో తమ పార్టీనే గెలిపిస్తారని కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మొదట అభ్యర్థిగా ప్రకటించిన రాజయ్య ఆ తర్వాత కోడలు, మనవళ్ళ మరణం కేసులో ఇరుక్కోవడం,  పార్టీ హడావిడిగా సర్వే సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించడం తమ కొంప ముంచే అవకాశం వుందా అని ఆ పార్టీ నాయకులు భయపడుతున్నారు.

అలాగే బీజేపీ - టీడీపీ కూటమి కూడా ఈ ఎన్నిక ఫలితం విషయంలో ధీమాగా వుంది. మోడీ మంత్రం, ప్రభుత్వంపై వ్యతిరేకత, తమ స్నేహం ఈ ఎన్నికలలో తమను గెలిపిస్తాయని అనుకుంటున్నారు. అయితే బీహార్లో బీజేపీకి ఎదురైన పరాజయం, పార్టీలన్నీ పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి అధికార పార్టీకే ఎక్కువ ఓట్లు పడే ప్రమాదం వుందన్న అనుమానం ఈ కూటమికి భయాన్ని కలిగిస్తోంది. ఇక వైసీపీ, వామపక్షాలు, ఇతర అభ్యర్థులు ఏదో ఆటలో అరటిపండులా పోటీ చేసి గెలుపు మీద ధీమాను వ్యక్తం చేస్తున్నారు తప్ప వాళ్ళకు గెలిచే అవకాశం, గెలుపు మీద ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇంకొంచెం ఓపిక పడితే చాలు... క్లారిటీ పూర్తిగా వచ్చేస్తుంది.