వివేకా పాపం.. తలా పిడికెడు

వైఎస్ రాజారెడ్డి కుమారుల్లో రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డిలు కడప రాజకీయాల్లో చక్రం తిప్పారు. వైఎస్ వంశానికి శాశ్వత కీర్తిని సంపాదించగా, వైఎస్ వివేకానందరెడ్డి కడప జిల్లాలో పనులు చక్కబెడుతూ జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించారు. వైఎస్ఆర్ మరణంతో తిరిగి ఆ కుటుంబంలో ఆధిపత్యం ఎవరిది అనే ప్రశ్న తలెత్తింది.

అప్పటికే ఎంపీగా, రాష్ట్రమంత్రిగా పని చేసిన వివేకానందరెడ్డి తన నాయకత్వాన్ని నిలుపుకొని కుటుంబ పెద్దగా తనను తాను ప్రకటించుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ తండ్రి స్థానం కోసం పావులు కదిపాడు. వివేకా, జగన్ ల మధ్య 2005 ప్రాంతం నుంచి జరిగిన పరిణామాలు గుర్తు చేసుకోవాలి.  2004లో కపడ  లోక్ సభ స్థానం నుండి వివేకానందరెడ్డి విజయం సాధించారు. అప్పటికి ఏ పదవిలోనూ లేని జగన్ కు లోక్ సభ సభ్యుడు కావాలన్న కోరిక పుట్టింది. దీంతో రాజీనామా చేయాల్సిందిగా కడప ఎంపీ వివేకాపై ఒత్తిడి పెరిగింది.  

జగన్ కు తండ్రి తోడవడంతో చేసేది లేక రాజీనామాకు సిద్ధపడిన వివేకానందరెడ్డి ఢిల్లీ వెళ్లారు. రెండు రోజులు ఎదురు చూసినా సోనియా దర్శనం కాకపోవడంతో నిరాశగా తిరిగి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరారు. మోతీలాల్ ఓరా ద్వారా సమాచారం తెలుసుకున్న సోనియా గాంధీ వైఎస్ వివేకాను ఏఐసీసీ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు.  విషయాన్ని సోనియాకు వివరించిన వివేకా తాను రాజీనామా చేస్తానని చెప్పారు. వివేకా ప్రతిపాదన సోనియాకు ఆగ్రహాన్ని తెప్పించింది. పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్న వివేకాను రాజీనామా చేయమని ఒత్తిడి చేయడాన్ని సోనియా తప్పుపట్టారు. వివేకాకు నచ్చజెప్పి ఆయనను తిరిగి హైదరాబాద్ పంపించారు సోనియాగాంధీ.

ఈ అంశాన్ని దగ్గరుండి చూసిన మరో కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు ఈ నిజాన్ని ఇటీవల ప్రపంచం ముందు ఉంచారు. అప్పటి నుంచి వివేకానందరెడ్డిని కష్టాలు పలకరిస్తూనే వచ్చాయి. 2009లో కడప లోక్ సభ స్థానాన్ని జగన్ కు వదిలేసి అనంతరం ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకున్నారు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్సార్ ప్రమాదవశాత్తు మరణించడంతో వివేకా కష్టాలు నూరింతలు పెరిగాయి. 2010లో జరిగిన పులివెందుల ఉప ఎన్నికల్లో వదిన విజయలక్ష్మికి మద్దతు పలికారు. కాంగ్రెస్ తో జగన్ తెగతెంపులు చేసుకున్న తరువాత 2011లో మరోసారి ఉప ఎన్నిక వచ్చింది. ఈ సారి వివేకా కాంగ్రెస్ తరఫున వదిన విజయలక్ష్మికి ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రిగా పని చేశారు. 2014 తరువాత వివేకా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇది గతం. ప్రస్తుతానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రతి విషయం వివేకా హత్య  చుట్టూ తిరుగుతోంది. 2019లో విజయం సాధించిన జగన్ ను ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య మింగుడుపడడం లేదు.

వివేకానందరెడ్డిని అడుగడుగునా ఇబ్బంది పెట్టిన పాపం, వివేక హత్య జరిగిన అనంతరం ఆయనపై వేసిన నిందల పాపం, ఆయన కుమార్తెకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్న పాపం, వివేకా హత్యకు మాస్టర్ ప్లాన్ వేసిన అవినాష్ ను కాపాడుతున్న పాపం.. ఇలా ఒకటి కాదు అన్ని పాపాలూ కలిసి ఇప్పడు జగన్ కు, ఆయన అనుయాయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రానున్న ఎన్నికలలో దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్పడం ఇక్కడ కొసమెరుపు.