కేసులు వేరు.. దర్యాప్తును అడ్డుకోవడంలో వ్యూహాలు ఒకటే!

వివేకా హత్య కేసు దర్యాప్తు జగుతున్న తీరు..చేరుకుంటున్న ముగింపు దశ చూస్తే.. ఈ కేసులో సూత్ర ధారులు, పాత్రధారుల పాత్ర దాదాపు బయటపడిపోయిందన్న భావన రాజకీయ సర్కిల్స్ లో వ్యక్తమౌతోంది. సీబీఐ ఎంత నిదానంగా, నత్తతో పోటీ పడుతూ దర్యాప్తు చేసినా సుప్రీం కేసు దర్యాప్తు పూర్తికి గడువు విధించడంతో తప్పని సరి పరిస్థితుల్లో కేసు దర్యాప్తును తార్కిక ముగింపు దిశగా తీసుకువచ్చింది.

ఈ పరిస్థితుల్లో కేసు దర్యాప్తును అడ్డుకోవడానికి ఎవరు ఏ విధంగా ప్రయత్నించినా.. అది వారికే బూమరాంగ్ అవ్వక మానదనీ, అనుమానపు దృక్కులు వారిపై కూడా ప్రసరించక మానవనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వివేకా హత్య కేసు  దర్యాప్తు సజావుగా సాగకుండా  సాధ్యమైనంత వరకూ జాప్యం జరిగేలా చూడటమే లక్ష్యంగా ఎత్తులు వేయడాన్ని జనం గుర్తించారు. ఇప్పటి వరకూ జరిగిన, జరుగుతున్న ప్రయత్నాల కారణంగా, ఆ ప్రయత్నిస్తున్నవారే ఈ కేసులో దోషులు అన్న నిర్ధారణకు జనం వచ్చేందుకు ఆస్కారం కలగడం  తప్ప మరో ప్రయోజనం నెరవేరిన దాఖలాలు కనిపించవు.  టెక్నికల్ గా కేసులు, పిటిషన్లతో దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకుంటూ.. జనం దృష్టిలో పలుచన అవ్వడమే కాకుండా..  నేరం చేసినట్లుగా ప్రజలు నమ్మడానికి మాత్రమే ఆ ప్రయత్నాలు దోహదం చేస్తున్నాయి.

ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్లు వివేకా హత్యలో ఆయన పాత్రపై అనుమానాలు పెంచాయి. తాత్కాలికంగా ఆయన తన ప్రయత్నాల ద్వారా అరెస్టును వాయిదా వేసుకోగలరు కానీ.. అంతకు మించి ప్రయోజనం సిద్ధించే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకులు అంటున్నారు.  వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకునేందుకు అనుసరించిన వ్యూహాలను   జగన్ అక్రమాస్తుల కేసులో అనుసరించిన వ్యూహాలతో పరిశీలకులు పోలుస్తున్నారు.

జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా పెద్ద సంఖ్యలో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ కేసు దర్యాప్తు, విచారణ ముందుకు సాగకుండా అడ్డుకున్న తీరును గుర్తు చేస్తున్నారు. అక్రమాస్తుల కేసు ఫైనాన్షియల్ ఫ్రాడ్ కు సంబంధించిన కేసు కనుక దర్యాప్తు విచారణకు సమయం పట్టడంలో ఆశ్చర్యం లేదు కానీ,  ఒక క్రిమినల్ కేసు ఇంతగా లాగ్ అవ్వడం వెనుక రాజకీయ జోక్యం తప్ప మరోటి కాదని అంటున్నారు. ఇప్పుడు కూడా కేసు దర్యాప్తు పూర్తికి సుప్రీం గడువు విధించినందునూ నాలుగేళ్లు దాటిన తరువాతైనా లాజికల్ ఎండ్ కు చేరుకుంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.