జూలు విదులుస్తన్న నెల్లూరు పెద్దా రెడ్లు

అనూహ్యం ఏమీ కాదు కానీ ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయం ఒక్క జారిగా వేడెక్కింది. రాష్ట్రం దృష్టిని తనవైపు తిప్పుకుంది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రేపో మాపో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. అటువంటి వేళ.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కడమే కాకుండా.. వేగాన్ని సైతం పుంజుకొన్నాయి.. జిల్లాలో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. 

తాజాగా హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు సాగిన ఈ భేటీలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే శనివారం ( జూన్ 10) వెంకటగిరి, ఆత్మకూరు, నెల్లూరు నియోజకవర్గ నేతలతోపాటు తన అనుచరులతో సైతం ఆనం సమావేశమై.. రాజకీయ భవిష్యత్, పార్టీ మార్పు తదితర అంశాలపై చర్చించారు.

ఇక వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారని సమాచారం.  మరోవైపు ఆనం కుమార్తె కైవల్య రెడ్డి సైతం.. నారా లోకేశ్‌ను ఇటీవల కలిశారు. అలాగే 2022లో ఒంగోలు వేదికగా జరిగిన మహానాడులో కైవల్యరెడ్డి దంపతులు.. చంద్రబాబు, లోకేష్‌తో భేటీ అయిన విషయం విదితమే. 

మరోవైపు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డితో తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో పాటు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు బీద రవిచంద్రలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లా రాజకీయాలకు సంబంధించి పలు కీలక అంశాలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 

ఇక ఇదే జిల్లాకు చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. ఉమ్మడి కడప జిల్లా బద్వేల్‌లో పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్‌ను కలిసి.. ఆయన పాదయాత్రకు మేకపాటి సంఘీభావం ప్రకటించారు. ఆ క్రమంలో రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకొంటున్న రాజకీయ పరిస్థితులపై వారిరువురు చర్చించారు.

అయితే ఇటీవల ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు సహకరించారంటూ.. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డితోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ముఖ్యమంత్రి   జగన్ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. 

కానీ ఒక రోజు తేడాతో కాస్తా అటు ఇటుగా అధికార జగన్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు .. అదీ నెల్లూరు జిల్లాకు చెందిన వారు.. తెలుగుదేశం నేతలతో  వేర్వేరుగా భేటీ  కావడం.. చర్చలు జరపడం రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  పరిస్థితులను బట్టి చూస్తే లోకేష్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించిన వెంటనే.. వీరంతా  తెలుగుదేశం గూటికి చేరుకుని ఆ పార్టీ విజయం కోసం కీలకంగా వ్యవహరించనున్నారనే ఓ చర్చ   నెల్లూరు జిల్లాలో నే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది.