చంద్రబాబు అక్రమ అరెస్టు తీరు భయం గొలుపుతోంది.. హీరో విశాల్

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు అన్ని వర్గాల నుంచీ తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. జగన్ ను విపరీతంగా అభిమానించే వారు కూడా చంద్రబాబు అక్రమ అరెస్టును తప్పుపడుతున్నారు. చంద్రబాబు వ్యతిరేకులు కూడా జగన్ తీరును ఏవగించుకుంటున్నారు. ఇది అధికార దురహంకారం, కక్ష సాధింపు వినా మరొకటి కాదని విమర్శిస్తున్నారు. చంద్రబాబు వంటి వ్యక్తినే ఇలా అక్రమంగా, అమానుషంగా అరెస్టు చేస్తే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు అరెస్టు తీరు చూసిన జగన్ ను సమర్ధించలేమనీ, హక్కుల కోసం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఉద్యమించడం వినా మరో మార్గం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో ఈ రంగం, ఆ రంగం, ఈ పార్టీ, ఆ పార్టీ అని లేదు.. చివరాఖరికి వైసీపీలో కూడా జగన్ పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. గత ఎన్నికలలో వైసీపీ తరఫున పని చేసిన ఎందరో ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి జగన్ ను తప్పపడుతున్నారు. ఇంకెంత మాత్రం ఆయనను సమర్ధించలేమని చెబుతున్నారు.  

సినీ ప్రముఖులు కూడా మీడియా ముందుకు వచ్చి జగన్ ను తప్పుపట్టడానికి వెనుకాడటం లేదు. తాజాగా హీరో విశాల్ జగన్ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తీరును తప్పుపట్టారు. జగన్ ను ఎంతగానో అభిమానించే విశాల్ చంద్రబాబు అరెస్టు విషయంలో మాత్రం జగన్ తప్పు చేశారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. జగన్ తన అభిమాన నాయకుడు అని చెప్పిన విశాల్.. అయినా చంద్రబాబు అరెస్టు విషయంలో ఆయన తీరును సమర్ధించలేనని అన్నారు. చంద్రబాబుకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు.  

 కేసు లేదు.. ఎఫ్ఐఆర్ లేదు… అరెస్ట్ చేసి విచారించి, ఆధారాలను రాబడతాం అంటూ  వందల మంది పోలీసులతో చుట్టు ముట్టి అర్ధరాత్రి చంద్రబాబును అరెస్టు చేసిన తీరు భయం గొలుపుతోందని విశాల్ అన్నారు.  చంద్రబాబు లాంటి వారికే ఈ పరిస్థితి వస్తే ఇక నా పరిస్థితి ఏమిటి  అన్న ఆందోళన కలుగుతోందని హీరో విశాల్ అన్నారు.  తాను హీరోనే అయినా  సామాన్యుడినేననీ,  చంద్రబాబు అరెస్టు తీరు చూసిన తరువాత హీరోగా సెలబ్రిటీనే అయినా తనకు భయం వేసిందని అర్ధం వచ్చేలా మాట్లాడారు.   ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ అని ఆందోళన వ్యక్తం చేశారు.  విశాల్ వ్యక్తం చేసిన భయమే నేడు ఏపీలో జనబాహుల్యంలో  కనిపిస్తున్నది. పేదలు, మధ్యతరగతి వారు, సంపన్నులు అన్న తేడా లేకుండా సర్వులూ జగన్ ఏలుబడిలో ఏపీలో భయానక వాతావరణం ఉందని అంటున్నారు. ప్రజల హక్కుల రక్షణకు ఉన్న వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయనీ ఆందోళన వ్యక్తం అవుతోంది.  ఏపీ ప్రజలకు మానవ హక్కులనేవే లేని పరిస్థితిని జగన్ ప్రభుత్వం సృష్టించిందని విమర్శిస్తున్నారు.