కవిత కొత్త పార్టీ.. బీఆర్ఎస్ భవిష్యత్తేంటి?
posted on Jan 10, 2026 9:24AM

తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు కల్వకుంట్ల కవిత ప్రయాణం అత్యంత ఆసక్తికర అంశంగా మారింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె అయిన కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ఖాయమైన నేపథ్యంలో.. ఆమె కొత్త పార్టీ ప్రభావం బీఆర్ఎస్ పై ఏ మేరకు ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. కవిత తాను సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె పార్టీ నిర్మాణ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ఆరంభించేశారు. 32 వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి పార్టీ ప్రకటన ఇక లాంఛనమే అని పరిశీలకులు సైతం అంటున్నారు.
అయితే ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలను ఎండగట్టడం ద్వారా.. ప్రత్యేక రాష్ట్ర ఫలాలను తెలంగాణ సమాజానికి అందించడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని తేల్చే దిశగా కవిత అడుగులు ఉన్నాయని అంటున్నారు.
ఇప్పటి వరకూ కవిత విమర్శలపై బీఆర్ఎస్ అగ్రనాయకత్వం స్పందించకపోవడం ఆ పార్టీని డిఫెన్స్ లో పడేసిందంటున్నారు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి కవిత దూకుడును అడ్డుకోకుంటే.. బీఆర్ఎస్ స్థానాన్ని కవిత ఆరంభించనున్న కొత్త పార్టీ ఆక్రమించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.