విజయసాయికి హద్దుల్లేవా? తెలియవా?

విజయసాయి రెడ్డి.. తెలుగు రాష్ట్రాలలో ఎవరికీ పరిచయం అక్కర్లేని పేరు. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా, వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఆయన సుపరిచితుడు. అన్నిటికీ మించి.. ప్రత్యర్థులపై అనుచిత భాషతో, ఆయనకు మాత్రమే ప్రత్యేక మైన అసభ్య, అనుచిత భాషలో విమర్శలు గుప్పించడంలో ఉద్దండుడు. విజయసాయి రెడ్డి తన పార్టీ అధినేత జగన్ కంటే ఎక్కువగా విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబును తలుచుకుంటారు. సమయం, సందర్భంతో సంబంధం లేకుండా ఇష్టారీతిన విమర్శలు గుప్పిస్తుంటారు.

అయితే  ఇటీవల  కొంత కాలంగా విజయసాయి మౌనంగా ఉన్నారు. వైసీపీలో ఆయన సీన్ అయిపోయిందనీ, జగన్ ఆయనను దూరం పెట్టారనీ పార్టీ శ్రేణుల నుంచే బలంగా వినిపించింది. అందుకు అనుగుణంగానే పార్టీలో ఆయన పదవులు ఒక్కటొక్కటిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల ఖాతాలోకి వెళ్లిపోయాయి. దాంతో అప్పటి వరకూ వైసీపీ, విజయసాయిని వేరువేరుగా చూడటం సాధ్యం కాదన్నట్లుగా ఉండే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పార్టీ ఆవిర్భావం నుంచీ, ఆఖరికి జగన్ అక్రమాస్తుల కేసులో కూడా జగన్ కు తోడూ, నీడగా ఉన్న విజయసాయి ప్రభ క్రమంగా వైసీపీలో తగ్గిపోయింది. ఆయనను పార్టీ దాదాపుగా దూరం పెట్టేసిందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. వైసీపీ శ్రేణులైతే పార్టీలో విజయసాయి సినిమా అయిపోయిందని బహిరంగంగానే చెప్పుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన పార్టీలో అత్యంత కీలకంగా మారడానికి కారణమైన ఆయన మార్కు విమర్శలకు విజయసాయి దూరంగా ఉన్నారు.  

అన్నిటికీ మించి తెనాలిలో జగన్ రైతు భరోసా కింద  మీట నొక్కి రైతుల ఖాతాలలో నిధులు జమ చేసే సమయంలో విజయసాయి పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందజేసిన సందర్భాన్ని పురస్కరించుకుని మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ  ట్వీట్ చేయడంతో జగన్ తో ఆయన ఢీ అంటే ఢీ అనేందుకు రెడీ అయిపోయారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఎందుకంటే   పీఎం ఒక రోజు ముందే రైతుల ఖాతాలలోకి విడుదల చేసిన నిధులకు జగన్ ఉత్తుత్తి మీట నొక్కుతున్నారన్న భావన కలిగించే విధంగా అప్పట్లో ఆయన చేసిన ట్వీట్ ఉంది.   అయితే వైసీపీలో సంక్షోభం ముదురుతున్న కొద్దీ విజయసాయి పార్టీకి దగ్గర అవ్వడం మొదలైంది. గతంలో అంత చురుకుగా, క్రియాశీలంగా కాకపోయినా విజయసాయి వైసీపీ కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించారు. మొల్లిమిల్లిగా జగన్ కు దగ్గర కావడానికి ఆయన తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

జగన్ కు నచ్చాలన్నా, మెచ్చాలన్నా చంద్రబాబుపై విమర్శలు చేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడమొక్కటే మార్గమన్న సంగతి విజయసాయికి తెలిసినంతగా ఎవరికీ తెలియదని పార్టీ శ్రేణులే ఉంటాయి. అయితే కొంత కాలం చంద్రబాబు ఊసెత్తని విజయసాయి మళ్లీ ఇప్పుడిప్పుడే చంద్రబాబుపై అనుచిత విమర్శలతో విరుచుకుపడుతూ.. జగన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 21) రాజ్యసభలో అసందర్భంగా చంద్రబాబు ఊసెత్తారు. సభలో లేని వ్యక్తిపై సభలో ప్రస్తావన రాకూడదన్న ప్రాథమిక  విషయాన్ని కూడా పట్టించుకోకుండా, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్  బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చ లో విజయసాయి చంద్రబాబు ప్రస్తావన తీసుకు వచ్చారు. ఆయన అసందర్భంగా చంద్రబాబు ప్రస్తావనను తీసుకురావడాన్ని సభలో అన్ని పార్టీల సభ్యులూ తప్పుపట్టారు.

బీఎంకే, బీఆర్ఎస్.. ఆఖరికి వైసీపీతో బహిరంగంగా రహస్యమైత్రి కొనసాగిస్తున్న బీజేపీ సభ్యులు కూడా విజయసాయి తీరును తప్పుపట్టారు. అయితే నవ్విపోదురుగాక నాకేటి అన్నట్లుగా ఆయన తీరు ఉంది. ఏళ్లతరబడి బెయిలుపై ఉన్న విజయసాయి.. గురివిందలా ఇతరుల గురించి మాట్లాడటం దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని పరిశీలకులు అొంటున్నారు.  మొత్తంగా విజయసాయి తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యసభలో విజయసాయి తీరు పట్ల పెద్దల సభలో సీనియర్ సభ్యులు కూడా ఆయనకు హద్దులు లేవా? తెలియవా? అంటూ విమర్శిస్తున్నారు.