తెలుగుదేశం సభ్యుల సస్పెన్షన్.. కోటంరెడ్డి కూడా
posted on Sep 21, 2023 11:59AM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయని అంతా భావించారో అలాగే జరుగుతున్నాయి. తెలుగుదేశం సభ్యులను మాట్లాడనీయకుండా వైసీపీ సభ్యులు వారిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడమే కాకుండా, సభలో గందరగోళ పరిస్థితి నెలకొనే విధంగా వ్యవహరించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు కు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియంలోకి దూసుకెళ్లిన టీడీపీ సభ్యులను మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడారు. ముఖ్యంగా అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు, సవాళ్లతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అనంతరం తెలుగుదేశం సభ్యులు 14 మందిని స్పీకర్ సస్పెండ్ చేశారు. అలాగే సీనియర్ సభ్యుడు పయ్యావుల కేశవ్, అనగాని తస్యనారాయణ, అలాగే వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను ఈ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేసి బయటకు పంపారు.
అంతకు ముందు సమావేశాలకు తెలుగుదేశం సభ్యులు పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్నారు. వారితో పాటు నలుగురు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యూలు కూడా ఉన్నారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ ఓటమి భయంతో ఉన్నారని అన్నారు. చంద్రబాబు జిల్లాల పర్యటనలకు, లోకేష్ పాదయాత్రకు వస్తున్న అశేష జనవాహినిని చూసి జగన్ భయపడుతున్నారనీ, వచ్చే ఎన్నికలలో ఓటమి ఆయనకు ఇప్పుడే కళ్ల ముందు కనిపిస్తోందని అన్నారు. ఆ భయంతోనే చంద్రబాబును ప్రజలలో మమేకం కాకుండా అడ్డుకునేందుకు అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. అయినా తెలుగుదేశం విజయాన్ని బలప్రయోగంతో అడ్డుకోవడం సాధ్యం కాదని జగన్ తెలుసుకోవాలన్నారు. రెట్టించిన ఉత్సాహంతో వైసీపీ అరాచకాలను ప్రజలలో ఎండగడతామన్నారు. కేసులు, వేధింపులకు భయపడే పరిస్థితి లేదని చెప్పారు. కాగా అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచీ సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
అసెంబ్లీ నుంచి ఇద్దరు తెలుగుదేశం సభ్యులతో పాటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఈ సమావేశాల వరకు సస్పెండ్ చేసారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యే ల ను గురువారం ( సెప్టెంబర్ 21) ఒక రోజు సస్పెండ్ చేశారు. కాగా అంతకు ముందు ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదన్నారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అక్రమ కేసులు, అరెస్టులకు భయపడే ప్రశక్తే లేప్రజల్లో తెలుగుదేశానికి ఉన్న స్పందన చూసే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకు భయపడేది లేదని బాలకృష్ణ తేల్చిచెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టు అంశాన్ని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు.