కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్
posted on Sep 22, 2025 9:43PM
.webp)
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆరాధ్య దేవతగా కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. నేటి నుంచి ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆలయానికి చేరుకోగా, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, ఆలయ ఈవో, వేదపండితులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం డిప్యూటీ సీఎం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. వేదపండితులు ఉప ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించగా, ఆలయ ప్రాంగణం “జయ జయ దుర్గ” నినాదాలతో మారుమ్రోగింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల మొదటి రోజున భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.