ప్రముఖులు వస్తే ఆయన ఉండాల్సిందే.. తిరుమలతో డాలర్ కు ప్రత్యేక అనుబంధం..    

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి మరణంతో టీటీడీ వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలుపుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు వివిధ పార్టీల నేతలు ఆయనకు సంఘీభావం తెలిపారు. 

స్వామివారికి నిత్యం జరిగే కైంకర్యాలు, ఆలయ సంప్రదాయాలపై డాలర్ శేషాద్రికి మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో ఆలయంలో డాలర్‌ శేషాద్రి సేవలను టీటీడీ సిబ్బంది, అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. 2007లో ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఆయనకున్న విశేషానుభవం దృష్ట్యా తిరుమల ఆలయ ఓఎస్డీగా కొనసాగిస్తోంది టీటీడీ. ప్రముఖులు ఎవరైనా తిరుమల వస్తే డాలర్‌ శేషాద్రి కచ్చితంగా అక్కడ ఉండేవారు. ఎవరైనా ప్రముఖులు వచ్చినప్పుడు ఆయన కనిపించకపోతే.. డాలర్ ఎక్కడా అని వాళ్లు వాకబు చేసేవారు. అంతగా తిరుమలతో డాలర్ శేషాద్రికి అనుబంధం ఉంది.

1978 నుంచి తితిదే వ్యవహారాల్లో ఉండటంతో ఎంతోమంది రాష్ట్రపతులు, ప్రధానులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు శ్రీవారి దర్శనానికి వస్తే ఆయన దగ్గరుండి కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌, ప్రధానులు పీవీ నరసింహారావు, వాజ్‌పేయీ, మన్మోహన్‌సింగ్‌, నరేంద్ర మోదీ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌, చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు వారితో డాలర్‌ శేషాద్రి అక్కడ కనిపించేవారు.