ఒమిక్రాన్‌ డేంజరే.. టీకాలు పని చేయకపోవచ్చు! ఎయిమ్స్‌ డైరెక్టర్‌ సంచలనం..   

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొత్త కొవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ భారతదేశంలోనూ కలకలం రేపుతోంది. మన దేశంలో ఇప్పటివరకు మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో ఇద్దరికి, మహారాష్ట్రలోన్ థానేలో మరొకరికి కొత్త వైరస్ నిర్దారణ అయింది. ఈ ముగ్గురు కూడా దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారే. ఒమిక్రాన్ సోకిన రోగుల కుటుంబ సభ్యులతో పాటు కాంటాక్టులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.  

ఒమిక్రాన్ కు సంబంధించి ఎయిమ్స్ డెరెక్టర్ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా సంచలన విషయాలు చెప్పారు. అత్యంత ప్రమాదకర వేరియంట్‌గా భావిస్తోన్న ఒమిక్రాన్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ లో 30కిపైగా ఉత్పరివర్తనాలు సంభవించినట్లు తెలిపారు. అందుకే దీనికి రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని పొందగలుగుతుందన్నారు. ఈ మ్యుటేషన్లే  ప్రమాదకరంగా మారవచ్చని.. ఇదే జరిగితే టీకా సామర్థ్యం కూడా తగ్గుతుందని ఎయిమ్స్ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు ఈ వేరియంట్‌ను ఏ మేరకు ఎదుర్కొంటాయనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా స్పష్టం చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటించడం, వ్యాక్సిన్‌ తీసుకోవడంలో ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.  

భారత్‌లో వినియోగిస్తోన్న వ్యాక్సిన్‌లతో పాటు అన్ని టీకాల సమర్థతను క్షుణ్ణంగా పరిశీలించి అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వేరియంట్‌ వ్యాప్తి, తీవ్రత, రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యానికి సంబంధించి వెలుబడే సమాచారంపైనే తదుపరి తీసుకోవాల్సిన చర్యలు ఆధారపడి ఉంటాయని డాక్టర్‌ గులేరియా చెప్పారు.  ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని.. కొవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యం వహించకూడదని డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికులతోపాటు స్థానికంగా కొవిడ్‌ కేసులు అకస్మాత్తుగా పెరిగే ప్రాంతాల్లో నిఘా పెంచాలని స్పష్టం చేశారు. వీటితోపాటు రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకోని వారు త్వరగా టీకా తీసుకోవాలని సూచించారు. మరోవైపు ఇప్పటికే పలుదేశాల్లో వెలుగు చూసిన ఈ కొత్తరకం వేరియంట్‌ మన దేశంలో ఇప్పటివరకు వెలుగు చూడలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వేరియంట్‌కు సంబంధించి భారత్‌లోని కొవిడ్‌ జీనోమ్‌ కన్సార్టియం ఇన్సాకోగ్‌ ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తోందని వెల్లడించింది.  

ఇప్పటివరకు వచ్చిన వేరియంట్లతో పోలిస్తే అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తోన్న ఈ ఒమిక్రాన్‌ (B.1.1.529) వేరియంట్‌ నవంబర్‌ 24న దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. అనంతరం బోత్సువానా, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియాతోపాటు పలు దేశాలకు విస్తరించింది. ఈ వేరియంట్‌పై సమీక్షించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..  ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించింది. అనంతరం దీనికి ఒమిక్రాన్‌గా నామకరణం చేసింది.