గులాబీదే గ్రేటర్ పీఠం.. కమలానికి మరో అస్త్రం!
posted on Feb 11, 2021 2:23PM
అనుకున్నట్టే అయింది. బీజేపీ అన్నట్టే జరిగింది. ఎమ్.ఐ.ఎమ్. సపోర్ట్ తోనే గ్రేటర్ పై గులాబీ జెండా ఎగిరింది. మేయర్ గా గద్వాల విజయలక్ష్మీ ఎన్నికయ్యారు. ఈ రసవత్తర పోరులో నిజంగా గెలిచిందెవరు? రాజకీయంగా లబ్ది పొందింది ఇంకెవరు? అనేది ఆసక్తికరం. అధికార పార్టీకి పదవైతే దక్కింది కానీ.. పొలిటికల్ గా పరువు పోయినంత పనైంది. ఎమ్.ఐ.ఎమ్. తో తమకెలాంటి సంబంధం లేదంటూ.. అది కూడా తమ ప్రత్యర్థి పార్టీనేనంటూ.. గ్రేటర్ ఎలక్షన్ సమయంలో నాటకాలాడిన టీఆర్ఎస్.. ఇప్పుడదే పతంగి పార్టీ మద్దతుతో విజయపతాకం ఎగరవేయడం దిగజారుడు తనమేనంటున్నాయి ప్రతిపక్షాలు. టీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ లది అక్రమ సంబంధమని.. ఆ రెండు పార్టీలు చీకట్లో ప్రేమించుకుంటాయంటూ కమలనాథులు విమర్శలు గుప్పిస్తున్నారు. జీహెచ్ఎమ్సీలో కారు పార్టీ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉంటుందంటూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ భగ్గుమన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ కలిసి ప్రజలను మోసం చేశాయని.. ఇద్దరు దొంగల చేతిలో మేయర్ పీఠమంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.
మేయర్ పీఠం పోయినా.. గ్రేటర్ పోరులో బీజేపీదే రాజకీయ విజయం. 48 మంది కార్పొరేటర్లతో కమలదండు గులాబీదళాన్ని దడదడలాడించింది. ఆ విజయోత్సాహంతో తెలంగాణ వ్యాప్తంగా దండయాత్రకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో జీహెచ్ఎమ్సీ మేయర్ ఎన్నిక జరగడం.. టీఆర్ఎస్ కు ఎమ్ఐఎమ్ మద్దతు ఇవ్వడం.. కమలనాథులకు అనుకోని వరంగా మారింది. బయటకు ఎన్ని మాటలు అనుకున్నా.. ఆ రెండు పార్టీల మధ్య దోస్తీ ఉందని బీజేపీ మొదటి నుంచీ చెబుతూనే ఉంది. ఆ విషయం మేయర్ ఎలక్షన్ లో బట్టబయలైంది. మజ్లిస్ పార్టీని ఓటింగ్ కు గౌర్హాజరు చేయించే అవకాశం ఉన్నా.. టీఆర్ఎస్ ఆ స్ట్రాటజీని అమలు చేయలేదు. బహిరంగంగానే ఆ పార్టీ సపోర్ట్ తీసుకొని రాజకీయంగా సాహసమే చేసిందని చెబుతున్నారు. ఎందుకంటే, ప్రస్తుత పరిస్థితుల్లో కారు, పతంగి చెట్టాపట్టాలు వేసుకొని కనిపించడం అధికార పార్టీకి ఏమంత లాభదాయకం కాదనేది విశ్లేషకుల మాట.
ఎమ్.ఐ.ఎమ్. ను బూచీగా చూపించి తెలంగాణ వ్యాప్తంగా హిందువుల ఓట్లను ఏకీక్రుతం చేస్తోంది బీజేపీ. ఓటర్లు సైతం కాషాయ పార్టీని బాగానే ఆదరిస్తున్నారు. దుబ్బాక, గ్రేటర్ లో సంచలన విజయాలే సాధించింది. ఇక, నాగార్జున సాగర్ లోనూ సత్తా చాటేందుకు సై అంటోంది. పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకేనంటూ ఇప్పటికే ప్రచారం నడుస్తోంది. త్వరలో జరగబోవు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాషాయ జెండా ఎగరేసేలా కాక మీదుంది కమలం పార్టీ. ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ మైత్రిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఓట్లు దండుకోవడం ఖాయం.
ఓ వైపు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి నిధుల సేకరణ పేరుతో తెలంగాణలో ప్రతీ ఇంటినీ తడుతోంది బీజేపీ. అటు.. హిందుత్వ ఎజెండా.. ఇటు యాంటీ ముస్లిం స్ట్రాటజీతో గులాబీ దళంపై డబుల్ బ్యారెల్ గన్ ఎక్కుపెట్టింది. దూకుడు మీదున్న కమలనాథులకు మరింత బలం చేకూర్చేలా.. గ్రేటర్ లో ఎమ్.ఐ.ఎమ్ మద్దతు తీసుకొని అధికార పార్టీ పెద్ద తప్పిదమే చేసిందంటున్నారు. మేయర్ ఎన్నిక ముగిసిన వెంటనే బండి సంజయ్, రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. టీఆర్ఎస్, మజ్లిస్ ల మైత్రిని తెలంగాణ ప్రజల ముందుంచి.. కేసీఆర్ ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నాడనే ముద్ర వేసి.. ఆ మేరకు రాజకీయంగా బీజేపీ మరింత బలపడటం ఖాయమని లెక్కలేస్తున్నారు. ఆ అవకాశాన్ని చేజేతులారా టీఆర్ఎసే కమలనాథులకు అందించిందని అంటున్నారు. మరి, పొలిటికల్ మాస్టర్ మైండ్ అని పేరున్న కేసీఆర్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా..?