అలిపిరి వద్ద సీఎం చంద్రబాబు కాన్వాయ్‌కి చిన్న ప్రమాదం..
posted on Sep 26, 2014 5:24PM

పదకొండు సంవత్సరాల క్రితం... అంటే 2003 సంవత్సరంలో అక్టోబర్ 1వ తేదీన తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న చంద్రబాబు మీద మందు పాతర దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ కేసు నిందితులకు గురువారమే శిక్ష పడింది. ఇదిలా వుంటే, ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో పాల్గొనడానికి వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌లోని ఒక వాహనానికి స్వల్ప ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లో వున్న ఇంటెలిజెన్స్ ఐజీ కారును తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి వాహనం ఢీకొంది. దీంతో వాహనం వెనుక భాగం కొంత దెబ్బతింది. ఇదిలా వుంటే తిరుపతి, తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య చంద్రబాబు క్షేమంగా పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. అయితే, పోలీసులు భద్రత పేరుతో చంద్రబాబును కలిసేందుకు కార్యకర్తలకు అనుమతి ఇవ్వలేదు. దాంతో తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు జోక్యం చేసుకుని పోలీసులకు, కార్యకర్తలకు సర్దిచెప్పారు.