తిరుమలలో ఇక అలా కూడా శ్రీవారి లడ్డూలు కొనొచ్చు

తిరుమలలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి కంపార్ట్ మెంట్లలో, క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది. దర్శన అనంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలు చేయడానికి కూడా మళ్లీ బోలెడంత సేపు క్యూలైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీనిని నివారించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది.

తిరుమల లడ్డూ కౌంటర్లలో రద్దీని, లడ్డూల కొనుగోలు కోసం భక్తులు అధిక  సమయాన్ని వెచ్చించే అవసరం లేకుండా చేయడం కోసం  కియోస్క్ల ద్వారా భక్తులు లడ్డూ టోకెన్లు తీసుకునే విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అందుబాటులోకి తీసుకువచ్చింది.   భక్తుడు తన దర్శన టికెట్ నంబర్ ను కియోస్క్లో నమోదుచేసి తనకు కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకుని  యూపీఐ  ద్వారా నగదు చెల్లించి ఆ రసీదును లడ్డూ కౌంటర్లో ఇస్తే సరిపోతుంది. అక్కడ భక్తుడికి కావలసిన సంఖ్యలో లడ్డూలు అంద జేస్తారు. దీని వల్ల లడ్డూ టోకెన్ తీసుకోవడానికి క్యూలైన్ లో నిలబడే అవసరం లేకుండా సమయం ఆదా అవుతుంది.