కర్మణ్యే.. విజయసాయి పోస్టు ఆంతర్యమేంటి?

మద్యం కుంభకోణం కేసులో సిట్ ముందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం హాజరుకావాల్సి ఉంది. అయితే తాను విచారణకు రాలేనని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు మాజీ ఎంపీ. తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటం వలన రాలేకపోతున్నట్లు విజయసాయి సమాచారం పంపారు.  
రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి శనివారం (జులై 12)న సిట్ విచారణకు హాజరు కాలేదు. మరో రోజు వస్తాననీ, ఏ రోజు అన్నది ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తాననీ సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అంత కంటే ముందే విజయసాయి  సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో   కర్మణ్యే వాధికారస్తే అనే శ్లోకం పోస్టు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ పోస్టు తెగ వైరల్ అవుతోంది. అంతకు మించి ఆసక్తి రేకెత్తిస్తోంది.  

విజయసాయి రెడ్డి ముందు ముందు ఏం చేయబోతున్నారనడానికి ఈ పోస్టు ఒక సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మద్యం కుంభకోణం విషయంలో తనకు తెలిసిన అన్ని వివరాణలూ ఫలితాలు, పరిణామాల గురించి ఆలోచించకుండా సిట్ కు నివేదించడానికి విజయసాయిరెడ్డి తనను తాను ప్రిపేర్ చేసుకుంటున్నారనడానికి ఈ పోస్టు ఒక నిదర్శనంగా చెబుతున్నారు.   జగన్ మోహన్ రెడ్డిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం తనకు లేదని విజయసాయి రెడ్డి గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉండే అవకాశాలు ఇసుమంతైనా లేవనడానికి ఈ పోస్టే సాక్ష్యంగా పేర్కొంటున్నారు.

 అంటే విజయసాయిరెడ్డి ఈ పోస్టు ద్వారా తాను మద్యం కుంభకోణంలో జగన్ పాత్రపై సిట్ కు వాంగ్మూలం ఇవ్వడానికి రెడీ అయిపోయిన సంగతిని పరోక్షంగా భగవద్గీత శ్లోకాన్ని ట్వీట్ చేయడం ద్వారా చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్గున్నారు. విజయసాయి మళ్లీ  జగన్ పంచన చేరుతారనీ, పార్టీలో మళ్లీ కీలకంగా వ్యవహరిస్తారనీ వస్తున్న వార్తలన్నీ ఊహాగాన సభలే అనడానికి కర్మణ్యేవాధికారస్య పోస్టు తిరుగులేని నిదర్శనంగా చెబుతున్నారు.