రాగి, ఇత్తడి పాత్రలను మిలమిల మెరిపించే చిట్కా..!

 

రాగి,  ఇత్తడి పాత్రలు ఇంటికి సాంప్రదాయ టచ్ ను  ఇస్తాయి. వీటి కారణంగా ఇల్లు అందంగా కనిపిస్తుంది. ఈ పాత్రలను ప్రతిరోజూ ఉపయోగించవచ్చు లేదా ఉపయోగించకపోవచ్చు, కానీ చాలా తొందరగా   అవి  మెరుపును కోల్పోతాయి. అయితే వీటిని మళ్లీ కొత్త వాటిలా మెరిపించడం కాస్త కష్టంతో కూడుకున్న పని.  వీటిని తోమలేక చాలా మంది ఇలాంటి పాత్రలను దూరంగా పెట్టేస్తుంటారు. అయితే  పండుగలు, ప్రత్యేక రోజుల్లో రాగి, ఇత్తడి పాత్రలు అవసరం అవుతాయి.  ఈ  రాగి పాత్రలు లేదా ఇత్తడి పాత్రలను కొత్త వాటిలా కేవలం సెకెన్ల వ్యవధిలో మెరిపించగల మ్యాజిక్ లిక్విడ్ ఉంది. సంతోషించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ లిక్విడ్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.  ఇంతకీ ఈ మ్యాజిక్ లిక్విడ్ ను తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు ఏమిటి? దీన్నెలా తయారు చేయాలి? ఎలా ఉపయోగించాలి?  తెలుసుకుంటే..

కావలసిన పదార్థాలు..

2 టీస్పూన్లు ఉప్పు
2 టీస్పూన్లు నిమ్మరసం
1 టీస్పూన్ డిష్ వాషింగ్ లిక్విడ్
1 టీస్పూన్ బేకింగ్ సోడా
2 టీస్పూన్లు వైట్ వెనిగర్

తయారీ విధానం..

ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. అది పెద్దదిగా ఉండాలి.   ముందుగా గిన్నెలో ఉప్పు వేసి, ఆపై నిమ్మరసం కలపాలి. డిష్ వాషింగ్ లిక్విడ్ కలిపిన తర్వాత, బేకింగ్ సోడాను కూడా జోడించాలి. చివరగా వైట్  వెనిగర్ జోడించాలి.  ఇలా చేస్తే  రాగి-ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి ద్రావణం సిద్ధమైనట్టే..

ఈ తప్పు చేయొద్దు..

ద్రావణాన్ని తయారు చేస్తున్నప్పుడు వెనిగర్  ఎక్కువగా ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  ద్రావణంలో ఎక్కువ వెనిగర్ కలిపితే పాత్రలు శుభ్రం అవుతాయి, కానీ ఎండిన తర్వాత, వాటిపై నల్ల మచ్చలు లేదా గుర్తులు కనిపించవచ్చు. కాబట్టి పాత్రలు మచ్చలు లేకుండా,  మెరుస్తూ ఉండాలంటే  పరిమిత మొత్తంలో వైట్ వెనిగర్  వాడాలి.

ఉపయోగించే విధానం..

రాగి,  ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి ద్రావణాన్ని పాత్రపై పూసి పాత్ర మొత్తం అప్లై అయ్యేలా చూడాలి. ఈ ద్రావణం తొలగించిన వెంటనే పాత్ర శుభ్రంగా కనిపిస్తుంది. ఇలా కాకపోతే.. తయారు చేసుకున్న ద్రావణాన్ని ఒక పెద్ద పాత్రలో వేయాలి. ఇందులో పాత్రలను ముంచి తీసినా పాత్రలు మెరిసిపోతాయి. ఆ తర్వాత నీటితో కడిగి పొడిగుడ్డతో తుడుచుకుంటే సరిపోతుంది.

                                    *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu