టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ పవన్‌కళ్యాణ్
posted on Jan 12, 2026 1:54AM

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకకూ ఎవరూ అందుకోనటువంటి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. సాంప్రదాయ జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన సోగో బుడో కన్రికై ఆయనకు ప్రతిష్టాత్మకమైన ఐదవ డాన్‌ను ప్రదానం చేసింది. అంతే కాకుండా ఆయనను టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదుతో సత్కరించింది. ఈ విషయాన్నీ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తన హ్యాండిల్ లో అధికారికంగా పోస్ట్ చేసింది.
పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ జర్నీ అనే పేరుతో ఒక వీడియోను షేర్ చేస్తూ.. పవన్ అసలు మార్షల్ ఆర్ట్స్ ఎలా మొదలుపెట్టారు .. ఎక్కడెక్కడ నేర్చుకున్నారు.. ఎలా ఎదిగారు లాంటివన్నీ ఆ వీడియోలో పొందుపరిచారు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ వీడియోకు వాయిస్ అందించారు. మార్షల్ ఆర్ట్స్ ని జనాల మధ్యకు తీసుకువెళ్లడంలో ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషికి గుర్తింపుగా గత ఏడాది డిసెంబర్ 30న ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు.
భారత దేశంలో జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కి దారి చూపించిన ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిఖీ మహ్మద్ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదు అందుకున్నారు. ఇలాంటి ఒక బిరుదును అందుకున్న మొట్ట మొదటి భారతీయుడు పవన్ కళ్యాణ్. . సోగో బుడో కన్రికై సంస్థ ద్వారా ఐదవ డాన్ గౌరవాన్ని సోకే మరమత్సు సెన్సై నేతృత్వంలో టకెడా షింగ్ క్లాన్ సమురాయ్ పరంపరలో పవన్ కళ్యాణ్ కి స్థానం కల్పించారు. ఈ వార్త తెలియడంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.