110 ఏళ్లకు పెళ్లి .. ఏడాదికే బిడ్డ...142 ఏళ్లలో మృతి
posted on Jan 16, 2026 2:41PM

ఆరోగ్య రహస్యంతో అక్షరాలా 142 ఏళ్లు జీవించిన సౌదీ అరేబియా కురువృద్ధుడు షేక్ నాసర్ బిన్ రద్దన్ అల్ వదాయి ఇకలేరు. 110 పదేళ్లకు మూడో పెళ్లి చేసుకుని, ఆపై ఏడాదికే తండ్రిగా మారి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన ఆయన జీవితం ఒక అద్భుతంగా నిలిచింది. క్రమశిక్షణతో కూడిన ఆహారం, దైవచింతనతో 40 సార్లు హజ్ యాత్ర చేసిన ఈయన.. 134 మంది వారసులను వదిలి వెళ్లారు.
దాదాపు ఒకటిన్నర శతాబ్దం పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపిన సౌదీ ఓల్డెస్ట్ మ్యాన్ షేక్ నాసర్ బిన్ రద్దన్ అల్ వదాయి తాజాగా ప్రాణాలు కోల్పోయారు. సౌదీఅరేబియా దేశం ఏర్పడక ముందే ఆయన జన్నించారు. 110 ఏళ్ల వయసులో ఎవరూ ఊహించని విధంగా మూడో పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత ఏడాదికే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అంతేకాకుండా 40 సార్లు హజ్ యాత్ర చేసి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్య పరిచాడు.
35 - 40 ఏళ్ల దాటితేనే పిల్లల్ని కనడానికి అనేక మంది స్త్రీ, పురుషులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే.. షేక్ నాసర్ మాత్రం వందేళ్లు పైబడినా పిల్లల్ని కనడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా శారీరక దృఢత్వం, మానసిక చురుకుదనం, సంతాన సామర్థ్యం కలిగి ఉండటం చూసి వైద్య నిపుణులు, పరిశోధకులు సైతం విస్మయానికి గురయ్యారు. ఆయన దీర్ఘాయువు వెనుక ఉన్న రహస్యాలపై ఇప్పటికీ అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.