ఒక్క పెగ్గు మద్యం కోసం సొంత అన్ననే చంపేశాడు!

ఒక్క పెగ్గు.. ఒక్కటంటే ఒక్క పెగ్గు కోసం విచక్షణ మరిచి సొంత అన్ననే మేడమీద నుంచి తోసేసి చంపేసిన తమ్ముడి ఉదంతమింది. మద్యపానానికి బానిసైన వారికి   తల్లీ, తండ్రీ, అన్నా, తమ్ముడూ, భార్యా, పిల్లలూ, స్నేహితులు.. ఇలా అన్ని సంబంధాలూ విచ్ఛిన్నమౌతాయి. కుటుంబం బంధాలలో చిచ్చు రేగుతుంది.  మద్యం వ్యసనానికి బానిసైన  వ్యక్తి విచక్షణ కోల్పోతాడు. చుక్క మద్యం కోసం ఉచ్ఛనీచాలనూ విస్మరిస్తారు. ఎంతకైనా తెగిస్తాడు. సరిగ్గా అలాంటి ఉదంతమే హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఒక్క పెగ్గు కోసం సొంత అన్ననే మేడ మీద నుంచి తోసేసి చంపేసిన తమ్ముడి ఉదంతం సంక్రాంతి పండుగ నాడు హైదరాబాద్ నాచారంలో చోటు చేసుకుంది.  

నాచారంలో నివాసం ఉంటున్న ఇద్దరు అన్నదమ్ములు  సంక్రాంతి పండుగ సందర్భం గా గురువారం (జనవరి 15)ఆనందోత్సాహాలతో పతంగులు ఎగరవేసి సంబరం జరుపుకున్నారు. ఆ తరువాత రాత్రి ఒక ఇంటి భవనం మూడో అంతస్తులో  మద్యం సేవించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మద్యం తాగుతుండగా, ఒక్క పెగ్గు విషయంలో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. అది కాస్తా వారి మధ్య వాగ్వాదానికీ, ఘర్షణకూ దారి తీసింది.  అన్న తమ్ముడిని ఒక్క పెగ్గు మద్యం ఇవ్వాలంటూ అడగడంతో వివాదం మరింత ముదిరింది.  ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు అన్నను ఒక్కసారిగా  మేడపై నుంచి తోసివేశాడు.  

మూడు అంతస్తుల భవనం పై తోసివేయడంతో కిందపడిన అన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  నిందితుడైన తమ్ముడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మద్యం మద్యం మత్తే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.  సంక్రాంతి పండుగ రోజున చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న వివాదం ప్రాణాంతకంగా మారడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu