సిట్టింగులకే టికెట్లు.. బీఆర్ఎస్ లో గందరగోళం
posted on Jun 2, 2023 2:25PM
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ లో లుకలుకలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. సిట్టింగులకు సీట్ల విషయంలో ఆ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. గత ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీ తలుపులు బార్లా తెరిచి మరీ చేర్చుసుకున్నారు. అంతే కాదు కొంత కాలం కిందట సిట్టింగులందరికీ వచ్చే ఎన్నికలలో మళ్లీ పోటీ చేసేందుకు టికెట్లు ఇస్తానని కూడా ప్రకటించేశారు. ఆయన ఏ వ్యూహంతో ఆ ప్రకటన చేశారో కానీ అదే బూమరాంగ్ అయ్యింది.
ఈ ప్రకటనతో ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంలేటి సుధాకర రెడ్డిలు ఆత్మీయ సమ్మేళనాలు అంటూ సందడి చేశారు. భారాస ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు దౌత్యంతో తుమ్మల వెనక్కి తగ్గారు కానీ, పొంగులేటి మాత్రం తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకు పోయారు. ఆయన ధిక్కార ధోరణితో పార్టీ నుంచి బహిష్కృతులయ్యారు కూడా. ఆయనకు తోడుగా జూపల్లి కృష్ణారావు ఉన్నారు. అలాగే వరంగల్ కు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, సిట్టిగులకే టికెట్ ప్రకటన చేసినప్పటి నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్ల్యే కడియం చిరకాల ప్రత్యర్ధి తాటికొండ రాజయ్యల మధ్య ఎప్పటినుంచో సాగుతున్న ప్రత్యన్న యుద్ధం పీక్ కు చేరింది.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, కడియమ నేరుగా కేసీఆర్ నే టార్గెట్ చేశారు. అందుకే ఆయన ఎవరికీ తలవంచను, ఎవరికీ పాదాభివందనాలు చేయనని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి చేయి జారుతోందని గ్రహించిన కేసీఆర్ నష్టనివారణ చర్యలలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చేత సిట్టింగులలో కొందరికి పార్టీ టికెట్లు వచ్చే అవకాశం లేదన్న ప్రకటన చేయించారు. అయితే అది కూడా ఎమంత ఫలితాన్ని ఇవ్వలేదు. మొత్తం మీద సిట్టింగులకు టికెట్ల వ్యవహారం బీఆర్ఎస్ లో పెద్ద సంక్షోభానికీ, గందరగోళానికీ దారి తీసింది. ప్రతి నియోజకవర్గంలోనూ ఇద్దరికి మించే ఆశావహులు ఉండటం.. ఎవరూ వెనక్కు తగ్గేందుకు సిద్ధంగా ఉడటంతో వారిలో టికెట్ దక్కని వారు రెబల్స్ గా బరిలో నిలిస్తే చాలా నియోజకవర్గాలలో బీఆర్ఎస్ విజయంపై ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇది వచ్చే ఎన్నికలలో విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలన్న కేసీఆర్ ఆశలకు గండి కొడుతుందని అంటున్నారు. ఎన్నికలు ఇక నెలల వ్యవధిలోకి వచ్చిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లపై మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ఇప్పటికిప్పుడు అసమ్మతి, అసంతృప్తి భగ్గుమనకుండా నష్ట నివారణ చర్యలలో భాగంగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లపై ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో పని తీరు బాగున్న సిట్టింగుల టికెట్లకు ఢోకా లేదని చెప్పారు. అలాగే పనితీరులో వెనుకబడ్డవారు తమ తీరు మార్చుకుని పుంజుకుంటే.. టికెట్లు దక్కే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు.
పార్టీ కోసం, పార్టీ విజయం కోసం ఎళ్ల వేళలా కృషి చేసే వాళ్లందరిపై పార్టీ అధినేత ఓ కన్నేసి ఉంచారని వివరించారు. మొత్తం మీద సిట్టింగులకు టికెట్ల విషయంలో కేసీఆర్ ముందుగానే చేసిన ప్రకటన బీఆర్ఎస్ లో కలకలం సృష్టించింది. సంక్షోభానికి తేరతీసింది. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇప్పుడు నష్ట నవారణ చర్యలకు శ్రీకారం చుట్టినా.. ఆశావహులందరినీ సంతృప్తి పరచడం సాధ్యమౌతుందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.