దస్తగిరి.. ఈ మాట ఇప్పుడు వైసీపీ నాయకులకు ఓ పీడకలగా మారిపోయింది. నిద్రలోనూ ఆ పేరే కలవరిస్తున్నారా అన్న అనుమానాలు కలిగేలా వారి వ్యవహార శైలి ఉంది. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి.. చుట్టే వైసీపీ నేతల చర్చలు, ఆరాలూ సాగుతున్నాయి. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి దస్తగిరిని అప్రూవర్ గా ఎలా అంగీకరిస్తారని సీబీఐని ప్రశ్నిస్తుంటే.. ఆ పార్టీ నేతలంతా దస్తగిరి ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు అన్న ఆరాల్లోనే మునిగిపోయారు.
ఇందుకు ఉదాహరణగా మంత్రి రోజా దస్తగిరి విషయం ఆరాతీస్తూ అడ్డంగా దొరికి పోయిన వీడియోనే సాక్ష్యం. ఆ వీడియోలో దస్తగిరి డిస్కషన్స్ లో ఉన్నాడా అని ఫోన్ లో ఎవరిలో అడగడం స్పష్టంగా వినిపిస్తోంది. ఆ తరువాత కూడా రెండు మూడు నిముషాలు ఆమె ఫోన్ లో అవతల ఉన్న వారు చెబుతున్నది విన్నారు. అంత సేపూ కూడా ఆమె ముఖకవళికలు పరిశీలిస్తే మంత్రి రోజా ముఖంలో ఒకింత ఆందోళన కనిపిస్తుంది. ఫోన్ పెట్టేసిన తరువాత కూడా కొన్ని క్షణాలు ఆమె మౌనంగా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ రోజా ఫోన్ లో ఎవరితో మాట్లాడారన్నది తెలియకపోయినా.. దస్తగిరి గురించి ప్రశ్నిస్తూ ఆమె చూపిన ఆత్రత, ఫోన్ లో అవతలి వారు చెబుతున్నది వింటూ ఆమె పడిన ఆందోళనా చూస్తుంటే వివేకా హత్య కేసులో తమ అధినేత ఇరక్కుంటున్నారా అన్న భయం స్పష్టంగా తెలిసిపోతుంది. వివేకా హత్య లో కుట్రకోణం.. ఎవరెవరి ప్రమేయం ఉందన్న విషయంలో రోజాకు ఒక అవగాహన ఉందా అన్న అనుమానం కలుగుతుంది. అదేమీ లేకపోయినట్లైతే.. అసలు దస్తగిరి ఏ డిస్కషన్స్ లో ఉంటే ఆమె కెందుకు, ఎవరితో భేటీ అయితే ఆమె కెందుకు అన్న ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. మొత్తం మీద వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు సూత్రధారులు, పాత్రధారులకు చేరువ అవుతున్న సంకేతాలు కనిపించడం మొదలైనప్పటి నుంచీ వైసీపీ నేతల వెన్నులో వణుకుపుడుతోందన్న పరిశీలకుల విశ్లేషనల్లో వాస్తవం ఉందనిపించక మానదు. దస్తగిరి ప్రస్తావన అనేసిరి కెమేరా ఆన్ లో ఉందనీ, తానొక మీటింగ్ లో ఉన్నానన్న సంగతీ మంత్రి రోజా మరచిపోయి అమితాసక్తిని ప్రదర్శించడం స్పష్టంగా తెలుస్తోంది.