మంత్రి మల్లారెడ్డా.. మజాకానా?

రాజకీయాలలో హాస్యం పండించడంలో దిట్టలు చాలా తక్కువ మంది ఉంటారు. వారు ఏం మాట్లాడినా జనం సీరియస్ గా తీసుకోరు. హాయిగా నవ్వుకుంటారు. వారి ప్రెస్ మీట్లకు మీడియా ప్రతినిథులు ఉత్సాహంగా హాజరౌతారు. ఎందుకంటే వారి మాట్లల్లో వెల్లివిరిసే హాస్యం పాఠకులను, ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.  

అలాంటి వారిలో ప్రముఖంగా విశ్వశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ముందు వరుసలో ఉంటారు. ఆ తరువాతి స్థానం కాకపోయినా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కూడా అలా హాస్యం ఒలికించే  పొలిటీషియన్లలో ముందు వరుసలో ఉంటారు. మల్లారెడ్డి రూటే సెపరేటు. ఆయన మాటే డిఫరెంటు. అందులో సందేహం లేదు. ఆయన ఏం మాట్లాడినా వెంటనే సామాజిక మాధ్యమంలో వైరల్ అయిపోతుంది. ఆయన సీరియస్ గా వేసే జోకులకు ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

గతంలో ఒక సారి ఆయన తన ఎదుగుదలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రోల్ అయ్యారు. కష్టపడ్డా.. పాలమ్మా, పూలమ్మా బోర్ వెల్ నడిపించా.. కాలేజీలు పెట్టా అంటే చేసిన వ్యాఖ్యలు ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. తాజాగా కూడా ఆయన బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దు అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా సరదాగా ఉన్నాయంటూ నెటిజన్లు అంటున్నారు. 

పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  హోమ్ శాఖ మంత్రి మహముద్ అలీ, డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులతో కలిసి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఆ సందర్భంగా తన ప్రసంగంలో  బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని తెలంగాణ హోం మంత్రి మొహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ లను ఆయన కోరారు. పోలీసులు ఫిట్ నెస్ పెంచుకోవడానికి పోలీస్ స్టేషన్లలోనే జిమ్ లు ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చేశారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, మన పోలీసులు బాగా పని చేస్తున్నారని అన్నారు. కేసులను త్వరగానే  పరిష్కరిస్తున్నారని మల్లారెడ్డి ప్రశంసించారు.

పోలీసులు కూడా మంచి ఫిట్ గా ఉండాలని చెప్పారు. పోలీసులను చూస్తే దొంగలు గజగజ వణికిపోవాలని అన్నారు. తాజాగా మంత్రిగారు చెప్పిన మాటల్లో ట్రోల్ చేయడానికి ఏమీ లేదు కానీ ఆయన నవ్వూతూ చెప్పిన ఈ మాటలు గతంలో  అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు  పోలీసులు స్టిఫ్ నెస్ కు..ఫిట్ నెస్ కు ఉదాహరణగా ఉండాలి అని చెప్పడాన్ని గుర్తుకు తెచ్చాయి.  బొజ్జ పెంచుకున్న పోలీసులకు ఇంక్రిమెంట్ ఇవ్వద్దని అప్పట్లో ఎన్టీఆర్ ఆదేశించారు. మల్లారెడ్డి నవ్వుతూ చెప్పినా వాస్తవమే చెప్పారు. పోలీసులు ఫిట్ నెస్ పై దృష్టి నిలపాలి అని నెటిజన్లు అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu