భాగస్వామి దగ్గర ఈ  మాటలు అస్సలు మాట్లాడకపోవడం మంచిది..!

 

ప్రతి వ్యక్తి తమ జీవితంలో ఒక్కో దశ దాటుతూ వెళ్లక తప్పదు.  ఈ క్రమంలో వివాహం చేసుకుని వైవాహిక బంధాన్ని ముందుకు తీసుకెళ్లక తప్పదు. అయితే గత 10 ఏళ్ల నుండి భార్యాభర్తల బంధం విషయంలో చాలా  మార్పులు చోటు చేసుకున్నాయి.  అమ్మాయిలు కూడా కెరీర్ ను సీరియస్ గా తీసుకోవడం.  లక్ష్యాలు సాధించడం,  భవిష్యత్తు గురించి ప్లానింగ్స్ లో ఉండటం.. మొదలైన  దేంట్లో తాము తీసిపోము అన్నట్టు  అబ్బాయిలకు ధీటుగా ఉంటున్నారు. ఆ కారణంగా బార్యాభర్తల జీవితంలో భర్త ఎక్కువ,  భార్య తక్కువ అనే స్లోగన్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. అమ్మాయిలు కూడా అబ్బాయిల లాగే తమకు కూడా వైవాహిక జీవితంలో తగిన ప్రాధాన్యత, నిర్ణయాలు తీసుకునే అధికారం,  తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే భార్యాభర్తల బంధం అప్డేట్ అయ్యింది. దీనికి తగినట్టుగానే మనుషులు కూడా మారాలి.  లేకపోతే బంధం దృఢంగా ఉండదు. ఇలాంటి పరిస్థితిలో భాగస్వామి ముందు అస్సలు మాట్లాడకూడని మాటలు కొన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి.  దీని వల్ల బంధం నాశనం కాకుండా ఉంటుంది.

భాగస్వామితో అనకూడని మాటలు..

 భాగస్వామితో ఎప్పుడూ " అతిగా స్పందిస్తున్నావు" అని అనకూడదు. ఇది భార్యాభర్తల  సంబంధాన్ని బాధించడమే కాకుండా పాయిజన్  చేస్తుంది. ఇది సంబంధాన్ని మరింత బలహీనపరుస్తుంది. ఏ వ్యక్తి అయినా పరిస్థితికి అనుగుణంగా తమ మనసులో ఉన్న ఎమోషన్ ఆధారంగానే స్పందిస్తారు. కాబట్టి దానికి అతి అనే పేరును ఆపాదించకూడదు.

ఏదైనా పని చేసిన తర్వాత లేదా  సహాయం పొందిన  తర్వాత  భాగస్వామితో  "ఇదేమంత పెద్ద విషయం కాదులే" అని ఎప్పుడూ అనకూడదు. ఇది  సంబంధాన్ని దెబ్బతీస్తుంది. సహాయం అయినా,  పని అయినా ఏదైనా సరే.. ఆ పనికి తగిన ఎఫర్ట్ పెట్టే అవతలి వ్యక్తులు చేస్తారు.  ముఖ్యంగా అందులో నా భర్త లేదా భార్య అనే ఫీలింగ్ తో సహాయపడటమే ఉంటుంది.  అలా చేసిన సహాయాన్ని లేదా పనిని పెద్ది కాదులే అని అనడం వల్ల ఎదుటి వ్యక్తి చిన్నతనంగా ఫీలవుతారు. నేను ఇంత చేసినా ఎందుకు ఇలా మాట్లాడతారు అనే బీజం మనసులో పడితే.. అది చాలా అపార్థాలకు దారి తీస్తుంది.  

ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడో.. లేదా గొడవ జరిగినప్పుడో.. ఎదుటి వ్యక్తి బాధపడితే అప్పుడు "నువ్వుచాలా సెన్సిటివ్ గా ఉన్నావ్" అంటూ వారిని తక్కువ చేసి మాట్లాడకూడదు.  స్పందన అనేది ఎమోషన్ ఆధారంగా,  అది వ్యక్తికి కనెక్ట్ అయ్యే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అలా వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడటం అంటే వ్యక్తిని తక్కువ చేసినట్టే. ఇది బంధాన్ని విచ్చిన్నం చేసే వైపు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి.

కొన్ని సార్లు ఏదైనా గొడవ లేదా వాదన జరిగితే.. కొందరు పాత వాటిని కూడా పైకి తీస్తుంటారు. చివరిగా ఎవరు క్షమాపణ చెప్పారో, ఇంటి పని ఎవరు చేస్తారో, లేదా ఎవరు ప్రారంభించారో లెక్కించడం తప్పు. ఇలాంటి  విషయాలను లెక్కిస్తూ ఉంటే అది సంబంధంలో అసంతృప్తిని పెంచుతుంది.  ఒకరి మధ్య ఒకరికి  దూరాన్ని పెంచుతుంది.

                           *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu