కష్టపడి సంపాదించిన డబ్బును ఇలాంటి వ్యక్తుల చేతుల్లో పెడితే నాశనమే..!
posted on Sep 12, 2025 11:57AM

డబ్బు నేటికాలంలో చాలా అవసరం. డబ్బు లేకపోతే ఏ పని జరగదు. ఆఖరికి నీళ్లు కూడా డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాం. డబ్బు సంపాదన కోసం చాలా కష్టపడతాం. రాత్రి, పగలు కష్టపడి మరీ డబ్బు సంపాదిస్తుంటారు. చాలా వరకు డబ్బు సంపాదనలో ప్రస్తుత అవసరాల గురించే కాకుండా భవిష్యత్తు అవసరాలకు, భవిష్యత్తు పరిస్థితులకు కూడా భాగం ఉంటుంది. అయితే డబ్బు సంపాదించడమే కాదు.. డబ్బును జాగ్రత్త చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం. కష్టపడి సంపాదించిన డబ్బును ఎలాగంటే అలా.. ఎవరి చేతిలో అంటే వారి చేతిలో పెట్టకూడదు. దీని వల్ల కష్టపడి సంపాదించిన డబ్బు అంతా నాశనం అవుతుంది. కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఇంతకీ డబ్బును ఎలాంటి వ్యక్తుల చేతుల్లో పెట్టకూడదు? తెలుసుకుంటే..
మోసం చేసే స్నేహితులు..
కొంతమందికి మోసం చేయడం అనే అలవాటు ఉంటుంది. వాళ్ళు ఎంత బాగున్నా.. వారికి ఏ ఇబ్బందులు లేకపోయినా సరే.. అప్పు పేరుతో లేక బదులు పేరుతో లేక వడ్డీ ఆశ చూపి డబ్బు తీసుకుని ఆ తర్వాత డబ్బు ఎగ్గొట్టేవారు ఉంటారు. ఇలాంటి అనుభవాలు ఒకటి రెండు సార్లు జరిగినా సరే.. వడ్డీ వస్తుందనే ఆశతోనో లేక ఎదుటి వ్యక్తులు మాట్లేడే మాట చాకచక్యంతోనో వారిని పదే పదే నమ్మేస్తూ ఉంటారు. అలాంటి వారి చేతిలో డబ్బు పెడితే ఆ డబ్బు, మన కష్టం రెండూ నాశనం అవుతాయి.
దురాశతో ఉండే పెట్టుబడిదారులు..
కొంతమంది ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను చూపించి డబ్బును తీసుకుంటారు. వడ్డీ ఎక్కువ వస్తుందనో.. ఏవైనా ఆఫర్ లు ఉంటాయనో.. తక్కువ కాలంలో ఎక్కువ మొత్తం తిరిగి ఇస్తారనో చెప్పి ప్రజల నుండి డబ్బు తీసుకుంచారు. పెద్ద పెద్ద క్లెయిమ్స్ చేయడం ద్వారా డబ్బు పెట్టుబడి పెట్టమని అడుగుతుంటారు. పైగా తాము చాలా పేరొందిన వారమని, తమకు గొప్ప వ్యక్తులు తెలుసునని చెప్పుకుంటారు. ఇలాంటివారు పెద్ద మొత్తంలో తమ చేతికి డబ్బు అందిన వెంటనే మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడతారు.
కేవలం తమ గురించి మాత్రమే మాట్లాడేవారు..
కేవలం తమ గురించి మాత్రమే మాట్లాడేవారు స్వార్థపరులని అర్థం. ఇలాంటివారు ఎప్పుడూ తమ గురించి చూసుకుంటారు. తమ పని జరిగడం కోసం ఎన్ని మాటలైనా చెప్తారు. తాము తప్ప సమస్యలు ఎవ్వరూ ఫేస్ చేయడం లేదనే ఫీలింగ్ లో ఉంటారు. తమ బాధను ఎంతో క్రిటికల్ గా చెబుతారు. వీరి మాటలలో ఎమోషన్ ను చూసి చాలామంది పాపం అనే ఫీలింగ్ తో డబ్బు ఇచ్చేస్తుంటారు. కానీ ఇలాంటివారు తమ అవసరం తీరిపోగానే తర్వాత ఏమీ మాట్లాడరు. కనీసం అందుబాటులోకి కూడా రారు. అందుకే ఇలా తమ గురించి మాత్రమే చెబుతూ.. ఎదుటివారి పరిస్థితి అర్థం చేసుకోకుండా డబ్బు గురించి అడిగే వారి చేతిలో ఎప్పుడూ డబ్బు పెట్టకూడదు.
కష్టపడని వారు..
కొందరు కష్టపడరు..కానీ అవసరానికి డబ్బు అడుగుతూ ఉంటారు. తమకు ఎలాంటి ఉద్యోగం రాకపోవడానికి కారణం చుట్టూ ఉన్న సమాజం, తన కుటుంబం అంటూ కారణాలు చెబుతూ ఉంటారు. ఇలాంటివారు కేవలం సులువుగా డబ్బు చేతికి వస్తే సుఖపడిపోదాం అనే ఆలోచనతో ఉంటారు. వీరికి డబ్బు విలువ, కష్టం విలువ అస్సలు తెలియదు. ఇలాంటివారు ఇతరులకు డబ్బు ఇవ్వకుండా మోసం చేసినా.. అదేం పెద్ద విషయం కాదని అనుకుంటారు. కాబట్టి ఇలాంటి కష్టం విలువ తెలియకుండా జులాయిగా ఉంటూ, సోమరితనంతో ఉండేవారి చేతిలో డబ్బు పెట్టకూడదు.
*రూపశ్రీ.