స్వరాజ్యం వెలుగుకు మొదటి నినాదం!!
posted on Feb 11, 2022 9:30AM
ఈ ప్రపంచంలో భారతదేశానికి ఎంతో ప్రత్యేకస్థానం ఉంది. అది సంస్కృతి, సంప్రదాయాల పుట్టిళ్ళు. విభిన్న మతాల నిలయం. ఇంకా చెప్పాలంటే భరత ఖండంబు చక్కని పాడియావు అనే గొప్ప మాట ఉంది. అలాంటి భారతదేశంలో బ్రిటీషు వారి రాక, వారి దౌర్జన్యం చాలా నష్టాలను, కష్టాలను భారత పౌరుల దోసిల్లలో పోసిందని చెప్పవచ్చు.ఇలాంటి భారతదేశంలో మొదటిసారిగా సతీసహగమనం, బాల్యవివాహాలు, విద్య, అంటరానితనం వంటి ఎన్నో సమస్యల మీద పోరాటం చేసి, స్వయం పరిపాలన కావాలని గొంతెత్తి చాటిచెప్పిన వాడు స్వామి దయానంద సరస్వతి.
ఈయన అందరికీ ఆర్యసమాజ స్థాపకుడిగా తెలుసు. భారతదేశంలో పౌరుల మనసులలో నుండి మూఢ నమ్మకాలు, అందవిశ్వాసాలను తొలగించడానికి ఈయన చేసిన కృషి ఎంతో గొప్పది. సాదారణంగా 1857 సంవత్సరంలో జరిగిన సిపాయిల తిరుగుబాటు ఆ నాటి పోరాటాలను మొదటి స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణిస్తారు చరిత్రకారులు. నాటి ఆ పోరాటంలో తనదైన కీలక పాత్ర పోషించి ఎందరో స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణగా నిలిచినవాడు స్వామి దయానంద సరస్వతి.
భారతీయ ప్రత్యేకత అయిన వేదాలు ఉపనిషత్తులను ఎంతో బాగా తెలుసుకుని, వాటిని జీవితంలో భాగం చేసుకుని పాటిస్తూ మరొకవైపు సామాజిక శ్రేయస్సు కోసం కూడా పాటుపడిన అతి తక్కువ మందిలో ఈయన ఒకరు. సాదారణంగా వేదాలు ఉపనిషత్తులు అవపోషన పట్టిన వారు దేవుడు, దైవం, పుణ్యషేత్రాలు, ప్రచనాలు, భోధలు అంటూ గురువులుగా మారిపోతూ ఉంటారు. కానీ ఈయన మాత్రం బ్రిటీషు వారి బానిసత్వంలో నలుగుతున్న భారతాన్ని, విచ్చిన్న దశలో మూలుగుతున్న ఈ గొప్ప సంప్రదాయ దేశాన్ని చూసి ఎంతగానో చలించిపోయారు. ఈ భారతం ఇలా బానిసత్వాన్ని దాటుకుని, పాశ్చాత్యుల కుట్రల నిజాలు తెలుసుకుని అందులో నుండి బయటపడాలి అని ఆవైపుగా ఎంతో పోరాటం చేశారు.
ఆర్యసమాజ స్థాపన!!
భారతదేశానికి ఉన్న విలువలు ఎంతో గొప్పవి. అనుసరించే సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవి. అయితే బ్రిటీషుల రాకతో భారతీయుల మెదళ్లలో హిందూ ధర్మం పట్లా, హిందూ దేవతల పట్లా ఒకానొక అపహస్యపు అస్త్రాలను మెల్లిగా విస్తరింపజేశారు. దానిపలితంగా కులాలు, మతాల చీలికలు. దేవతల వారిగా ప్రజలు కూడా వర్గాలుగా విడిపోయి తమలో తాము కొట్టుకుంటూ భారతీయ హిందూ ధర్మాన్ని విచ్చిన్నం వైపుగా తీసుకెళ్ళసాగారు.
ఈ పరిణామాలు అన్నిటినీ కళ్లెదురుగా చూస్తున్న స్వామి దయానంద సరస్వతి గారు ధర్మ సంస్థాపనను శాశ్వతంగానూ, దేశంలో ఉన్న ఎన్నో అవకతవకలను సంస్కరించడానికి. ముఖ్యంగా బాల్య వివాహాలు, విద్య, మూఢ నమ్మకాలు, అంటరానితనం, సతీసహగమనం వంటివాటిని అరికట్టాలనే ఉద్దేశంతో ఆర్యసమజాన్ని స్థాపించాడు. ఈ ఆర్యసమాజం నాటి నుండి ఇప్పటి వరకు కూడా భారతీయుల జీవితాల్లో భాగమై నాటి స్వామి దయానంద సరస్వతి కృషికి గుర్తుగా నిలిచి ఉంది.
మరణం వెనుక భయంకరమైన నిజం!!
కొందరు చేస్తున్న పనులు మరికొందరి స్వార్థానికి అడ్డుకట్టలు వేస్తుంటాయి. స్వామి దయానంద సరస్వతి ఆర్యసామాజం నెలకొల్పి దాని సహాయంతో దేశాన్ని సంస్కరించడం మొదలుపెట్టాక చాలామంది తమ స్వార్థపూరిత కార్యకలాపాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే ఆయన్ను అడ్డు తొలగించుకుంటే తమ సమస్యలు తీరుతాయని భావించి ఆయనకు విషప్రయోగం చేశారు. అయితే యోగాలో ఎంతో శక్తివంతమైన, మరెంతో రహస్యమైన బస్తి, న్యోలి అనే పద్ధతుల ద్వారా తన ప్రేగులను శుభ్రం చేసుకుని ఆ విషాల నుండి రెండు సార్లు బయటపడ్డారు స్వామి దయానంద. కానీ మూడవసారి మాత్రం ఆయన శరీరం విషానికి లొంగిపోయి క్షీణించి విశ్వం నుండి వీడ్కోలు తీసుకుంది.
ఇట్లా భారతీయ ప్రజానీకానికి పెద్దగా లోతుగా తెలియని స్వామి దయానంద కేవలం యోగి, ఋషి మాత్రమే కాదు భారతప్రజల కోసం స్వరాజ్యానికి పిలుపిచ్చిన మొదటి భారతీయుడు కూడా.
◆ వెంకటేష్ పువ్వాడ