రాష్ట్ర విభజనతో రాహుల్ గాంధీ భవిష్యత్తుకి దెబ్బ

 

ఒకవైపు జంతర్ మంతర్ వద్ద వైకాపా సమైక్య ధర్నా మరో వైపు రామ్ లీలా మైదానంలో ఏపీయన్జీవోల సమైక్య సభ ఈరోజే జరిగాయి. కానీ కాంగ్రెస్ అధిష్టానం వాటి గురించి అసలు పట్టించుకొనే లేదు. లక్షలాది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి రెండున్నర నెలలు ఉద్యమించినా పట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం, స్వయంగా తన ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, కేంద్రమంత్రులు, యంపీలు డిల్లీలో తన కళ్ళెదుటే ధర్నా చేసినప్పుడు కూడా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చొన్న కాంగ్రెస్ అధిష్టానం, ఇటువంటి తాటాకు చప్పుళ్ళకు భయపడి వెనక్కి తగ్గుతుందని ఎవరూ భావించరు. అయితే, ప్రజాభిప్రాయాన్ని పెడచెవినబెట్టి కాంగ్రెస్ అధిష్టానం ఏవిధంగా రాష్ట్ర విభజనకు పూనుకొంటోందో ఈ సభలు, ధర్నాలతో, పార్లమెంటులో నిత్యం జరుగుతున్న ఆందోళనలతో యావత్ దేశానికి తెలిసింది.

 

బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ తన ప్రతీ సభలో కూడా ఈ వ్యవహారంలో కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతుంటే, అదే సమయంలో అద్వానీ, వెంకయ్య నాయుడు, సుష్మాస్వరాజ్, జైట్లీ, జవదేకర్ వంటి బీజేపీ నేతలందరూ మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతున్నారు. జాతీయ మీడియా తెలుగు ప్రజల గోడు పట్టించుకోకపోవచ్చునేమో కానీ, ఈ వ్యవహారంలో బీజేపీ అగ్రనేతలు చెపుతున్న విషయాల గురించి ప్రముఖంగా ప్రచురిస్తున్నందున, వారి ద్వారా తెలుగు ప్రజల ఆవేదన దేశ ప్రజలందరికీ ఎప్పటికప్పుడు చేరుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పట్ల వ్యతిరేఖతతో ఉన్న దేశ ప్రజలలో ఇదంతా మరింత వ్యతిరేఖత పెంచడం తధ్యం. దానివలన కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలుగుతున్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం అంత దూరం ఆలోచించే స్థితిలో లేదు కనుక, మొండిగా ముందుకే పోతోంది.

 

రాష్ట్ర విభజన ద్వారా తెలంగాణాలో 15 యంపీ సీట్లను తన ఖాతాలో పడేలా చేసుకొని రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టాలని తపిస్తున్న సోనియాగాంధీ, సరిగ్గా ఇదే వ్యవహారంతో దేశవ్యాప్తంగా మరింత వ్యతిరేఖతను చేజేతులా సృష్టించుకొని కనీసం నూరు యంపీ సీట్లయినా సాధించుకోలేకపోతే, ఇక తెలంగాణా లో ఎన్ని సీట్లు వస్తే మాత్రం ఏమి లాభం? అప్పుడు కాంగ్రెస్ పని వ్రతం చెడినా ఫలం దక్కనట్లవుతుంది. దురాశకు పోయి దురాలోచన చేసినందుకు కాంగ్రెస్ రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా ఈసారి అధికారం దక్కించుకోలేకపోతే ఇక రాహుల్ గాంధీ మరొక పది పదిహేనేళ్ళవరకు ప్రధాని కుర్చీ వైపు కన్నెత్తి చూసేపని కూడా ఉండదు.