కరోనా కేంద్రాలుగా వైన్ షాపులు!

మద్యం షాపులు కరోనా కేంద్రాలుగా మారుతున్నాయంటూ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైన్స్, పబ్స్, రెస్టారెంట్స్, థియేటర్స్‌లో రద్దీపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కారును ఆదేశించింది. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే వాటి లైసెన్స్‌లు రద్దు చేసి, వారిపై క్రిమనల్ కేసులు నమోదు చేయాలని సూచించింది. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, పెళ్లిళ్లలో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారని న్యాయస్థానం మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు 70 శాతం పెంచాలని సూచించింది. మద్యం దుకాణాలు కరోనా వనరులుగా మారాయని ఈ సందర్భంగా హైకోర్టు  వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు చేయాలని సూచించింది. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వారికి వ్యాక్సిన్ అందజేయాలని.. నిపుణులతో సలహా కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 

కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనలపై సుమారు 22వేల కేసులు నమోదు చేసినట్టు డీజీపీ నివేదికలో వెల్లడించారు. సామాజిక దూరం పాటించని వారిపై 2,416 కేసులు, రోడ్లపై ఉమ్మి వేసిన వారిపై 6 కేసులు నమోదు చేశామని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1.16లక్షల మందికే  జరిమానానా? అని హైకోర్టు ప్రశ్నించింది. పాతబస్తీ ప్రాంతంలో రెండు రోజులు తనిఖీ చేస్తే లక్ష మంది దొరుకుతారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లాక్‌డౌన్‌ లేకపోయినా.. కంటైన్‌మెంట్‌ జోన్లు కచ్చితంగా ఉండాలని సూచించింది హైకోర్టు.