అవినాష్ కు ముందస్తు బెయిలు.. షరతులు వర్తిస్తాయి!

తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిలు లభించింది. సీబీఐకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదనీ, అలాగే ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరు కావాలని షరతులు విధించింది. వివేకా హత్య కేసులో సీబీఐ అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా  చూపలేకపోయిందని కోర్టు పేర్కొంది. ఇలా ఉండగా అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ లో గత శుక్ర, శనివారాలలో సుదీర్ఘ వాదలను జరిగాయి. ఆ సందర్భంగా సీబీఐ  తన కౌంటర్ అఫిడవిట్ లో తొలి సారిగా ఏపీ సీఎం జగన్ పేరు ప్రస్తావించింది.

అవినాష్ ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. అనంతరం కోర్టు అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యం దృష్ట్యా బుధవారం (మే 31) వరకూ అరెస్టు చేయద్దని ఆదేశిస్తూ ముందస్తు బెయిలుపై తన నిర్ణయాన్ని అదే రోజు వెలువరిస్తామని పేర్కొంది. ఈ రోజు ఉదయం తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ కు షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. వెకేషన్ బెంచ్  ఉత్తర్వులపై సీబీఐ, వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని అంటున్నారు.  

ఇలా ఉండగా అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు లభించడంపై న్యాయ నిపుణులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపుగా అవినాష్ రెడ్డిపై ఉన్న ఆరోపణలనే ఎదుర్కొంటున్న ఆయన తండ్రి భాస్కరరెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ ఇంత కాలం అవినాష్ ను ఎందుకు అరెస్టు చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందస్తు బెయిలు విషయంలో  తెలంగాణ హై కోర్టు, సుప్రీం కోర్టూ కూడా ఎటువంటి నిర్ణయం వెలువరించకుండా, అరెస్టు చేయకుండా ఎటువంటి ఆదేశాలూ ఇవ్వకపోయినా సీబీఐ ఆయనను అరెస్టు చేయకపోవడాన్ని తప్పుపడుతున్నారు. సీబీఐ అవినాష్ కు అరెస్టు కాకుండా తప్పించుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలనూ ఇచ్చిందనీ అంటున్నారు.

ఇప్పుడు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు తీర్పుకు భిన్నమైన ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. హైకోర్టు కూడా తన విచారణలో సీబీఐ తప్పులనే ఎత్తి చూపిందని, అవినాష్ పోన్ ఇంత వరకూ ఎందుకు స్వాధీనం చేసుకోలేదనీ ప్రశ్నించింది. మొత్తం మీద అవినాష్ కు ముందస్తు బెయిలు విషయంలో సీబీఐ వైఫల్యం ప్రస్ఫుటంగా బయటపడిందంటున్నారు.