జగన్ కు జడ్ ప్లస్ కేటగిరి భద్రత?!

ఒక వైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడికి జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఎందుకు అని ప్రశ్నిస్తారు. ఆ బ్లాక్ కమెండోల భద్రతే లేకపోతే ఆయన ఎప్పుడో ఫినిష్ అయిపోయి ఉండేవారని హెచ్చరిస్తారు. మరో వైపు ముఖ్యమంత్రి జగన్ భద్రతకు ఐసీఎస్  వంటి ఉగ్ర సంస్థల నుంచి ముప్పు ఉందంటూ ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు ఆయనకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రానికి లేఖ రాశారు.

 తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి భద్రతకు ముప్పు అధికార వైసీపీ మూకల నుంచే ఉందని కళ్లెదుటే కనిపిస్తుండగా తమ్మినేని సీతారాం భద్రత తీసేయమని ఏపీ స్పీకర్ హోదాలో కేంద్రానికి సిఫారసు చేస్తానని వైసీపీ కార్యకర్తల సమావేశంలో చెప్పారు. ఇక ఐసీఎస్ వంటి ఉగ్రసంస్థల నుంచి ఎవరికైనా ముప్పు ఉంటే అది ముందుగా తెలిసేది కేంద్ర నిఘా సంస్థలకే కానీ ఏపీ ఇంటెలిజెన్స్ కు కాదు. అంతర్జాతీయ ఉగ్ర సంస్థల కదలికల గురించి తెలుసుకునేందుకు కేంద్ర నిఘా సంస్థలకు పటిష్టమైన అత్యున్నతమైన వ్యవస్థ ఉంది. ఆ నిఘా సంస్థల ద్వారానే రాష్ట్రాలకు అంతర్జాతీయ ఉగ్ర సంస్థల కదలికలకు సంబంధించిన సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటిది జగన్ కు ఐసీఎస్ వంటి ఉగ్ర సంస్థల నుంచి ముప్పు ఉందంటూ.. కేంద్ర నిఘా సంస్థలకు కూడా తెలియని సమాచారాన్ని ఏపీ ఇంటెలిజెన్స్  కనిపెట్టేసి  జగన్ రెడ్డికి జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రాన్ని కోరింది. 

అదే సమయంలో రాష్ట్రంలో పరిస్థితి చూస్తే జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఆల్రెడీ ఉన్న  విపక్ష నేత నారా చంద్రబాబునాయుడి పర్యటన సందర్భంగా అధికార పార్టీ మూకలు దాడులకు సంబంధించి సమాచారం మాత్రం ఏపీ ఇంటెలిజెన్స్ కు అందదు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి గురించి కానీ, కుప్పం, నందిగామ, అనపర్తి సంఘటనలకు సంబంధించి ఏపీ ఇంటెలిజెన్స్ వైఫల్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో నిఘా వైఫల్యాల గురించి పట్టించుకోని ఏపీ ఇంటెలిజెన్స్ అంతర్జాతీయ ఉగ్రవాదుల అనుపానులు గమనించి ఏపీ ముఖ్యమంత్రికి ఐసీఎస్ వంటి ఉగ్ర సంస్థల నుంచి ముప్పు ఉందంటూ ఆయన భద్రత రాష్ట్ర పోలీసుల వల్ల కాదు కనుక జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రాన్ని కోరడం విడ్డూరంగా ఉంది.

  ముఖ్యమంత్రిగా జగన్ కు ఇప్పుడు ఉన్న భద్రత కారణంగా కిలోమీటర్ వరకూ ఆయన అనుమతించిన వారు తప్ప  ఇతరులు ఉండే అవకాశం లేదు.  అత్యున్నత స్థాయి ముప్పు ఉందని నివేదికలు ఉంటేనే జడ్ ప్లస్ భద్రత కల్పిస్తారు.  సీఎంలలో యోగి ఆదిత్యనాథ్, అరవింద్ కేజ్రీవాల్ లకు మాత్రమే జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు. ఇతర బీజేపీ సీఎంలకూ ఆ స్థాయి భద్రత లేదు.